Earthquake : మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. దాంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. ఆదివారం మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదించింది. వెంటనే స్పందించిన సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
అయితే శుక్రవారం సంభవించిన భారీ భూకంపం వల్ల రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాగా శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 1600 మందికిపైగా మృతిచెందారు. 3,400 మందికి పైగా అదృశ్యమయ్యారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
శనివారం ఉదయం 11.53 గంటల సమయంలో 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8 తీవ్రతతో, 20 నిమిషాల వ్యవధిలో 4.7 తీవ్రతతో వరుసగా ప్రకంపనలు వచ్చినట్లు భూకంపన వైజ్ఞానిక కేంద్రాలు వెల్లడించాయి. తాజాగా మరోసారి భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆకాశహర్మ్యం కుప్పకూలిన ఘటనలో అక్కడ పనిచేస్తోన్న వారిలో 78 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారి జాడ ఇంకా తెలియరాలేదు. భారీగా ఉన్న శిథిలాలను తొలగించడానికి శక్తిమంతమైన యంత్రాలను వినియోగిస్తున్నారు.