Earthquake | న్యూఢిల్లీ: మయన్మార్, బ్యాంకాక్‌లో సంభవించిన తాజా భూకంపం ప్రపంచ దేశాల ప్రజలను గగుర్పాటుకు గురి చేసింది. ప్రకృతి విపత్తుల్లో భయంకరమైన భూ కంపాలు శతాబ్దాలుగా మానవాళిపై పెను ప్రభావాన్ని చూపి తీరని ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూకంపాలు కలిగే విధానం, వాటికి గల కారణాలు, వాటి చరిత్ర తెలుసుకోవడం మనందరికీ అవసరం. భూమి ఉపరితలంలోని రాతి పొరలో అత్యంత పెద్దవైన, దృఢమైన పలకలు (టెక్టోనిక్ ప్లేట్స్) ఉంటాయి. ఇవి ఎల్లప్పుడూ నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. వీటి మధ్య చీలికలు, భారీ ఖాళీ ప్రదేశాలు కూడా ఉంటాయి. వీటి మధ్య ఘర్షణ వల్ల ఒక పలక మరో పలకను ఢీకొట్టి, కదలకుండా నిలిచిపోతాయి. ఈ పలకలు అకస్మాత్తుగా ఖాళీ ప్రదేశం వైపు దూసుకెళ్లినపుడు భూకంపాలు వస్తాయి. హఠాత్తుగా శక్తి విడుదలవడం వల్ల భూకంప తరంగాలు ఏర్పడతాయి. తద్వారా భూమి కంపిస్తుంది.
అగ్ని పర్వతాల పేలుడు, మహా సముద్రాలు, సరస్సుల కార్యకలాపాలు; గనుల తవ్వకం, సబ్‌వేల నిర్మాణం, ఇతర భూగర్భ పేలుళ్లు వంటివి కూడా భూకంప తరంగాలకు కారణమవుతాయి. అణ్వాయుధ వార్‌హెడ్స్ పేలుడు వల్ల కూడా భూకంపం వంటి తరంగాలు ఏర్పడతాయి.
అనేక టెక్టోనిక్ ప్లేట్స్ ఏక కేంద్రాభిముఖంగా కదులుతున్న చోట భారత దేశం ఉంది. ఈ భౌగోళిక పరిస్థితుల వల్ల భూకంపాలు పొంచి ఉన్న దేశంగా భారత దేశం మారింది. దీనికి తోడు జనాభా వేగంగా పెరుగుతుండటం, క్రమబద్ధం కాని రీతిలో భవన నిర్మాణాలు విస్తృతంగా జరుగుతుండటం సమస్యను పెంచుతున్నాయి. భూకంపాలు పొంచి ఉన్న దేశాల్లో ప్రపంచంలో ఏడో స్థానంలో భారత్ నిలిచింది. ndma.gov.in ప్రకారం, దేశంలోని 59 శాతం భూభాగం ఓ మోస్తరు నుంచి తీవ్రమైన భూకంప సంఘటనల ముప్పు ప్రభావంలో ఉంది. యావత్తు హిమాలయాల ప్రాంతానికి భూకంప లేఖినిపై 8.0 తీవ్రతకుపైగా శక్తిమంతమైన భూకంపాల ముప్పు ఉంది.
1. వాల్డీవియన్ భూకంపం
9.5 తీవ్రతతో1960 మే 22న సంభవించింది. చిలీ తీరంలో వచ్చిన ఈ భూకంపం వల్ల 1,655 మంది మరణించారు.
2. గ్రేట్ అలస్కా భూకంపం
1964 మార్చి 28న దక్షిణ అలస్కాలో 9.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంలో 131 మంది మరణించారు.
3.సుమత్ర-అండమాన్ దీవుల్లో భూకంపం
2004 డిసెంబరు 26న 9.1 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం, సునామీలో ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల్లో 2,83,000 మందికిపైగా మరణించారు.
4.జపాన్ భూకంపం, సునామీ
2011 మార్చి 11న 9.1 తీవ్రతతో దిగ్రేట్ టోహోకు భూకంపం సంభవించింది. 18 వేల మందికిపైగా మరణించారు, 6 వేల మందికిపైగా గాయపడ్డారు.
5.కచ్చట్కా, రష్యా భూకంపం
1952 నవంబర్ 4న 9.0 తీవ్రతతో భూ కంపం, సునామీ కారణంగా 4 వేల మంది మరణించారు.
భూకంపం వచ్చినపుడు ఆందోళనకు గురి కాకూడదు. ప్రశాంతంగా ఉండాలి. పరుగులు తీయకూడదు. ప్రకంపనలు ఆగిపోయే వరకు వేచిచూడాలి. పై అంతస్థుల్లో ఉన్నవారు క్రింది అంతస్థుకు వచ్చి, గట్టి టేబుల్ లేదా డెస్క్ క్రింద ఉండాలి. భూకంపం సమయంలో కాని, ఆ తర్వాత కాని వదంతులను ప్రచారం చేయకూడదు.
నైపేయీ, మార్చి 30: మయన్మార్‌తోపాటు థాయ్‌లాండ్‌లో ఈ నెల 28న 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణు బాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనాన్ని సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశముందని ఆమె హెచ్చరించారు.ప్రస్తుత విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశముందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేస్తున్నది.
మయన్మార్‌లో ఆదివారం మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. దాంతో ఇండ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదించింది. వెంటనే స్పందించిన సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారీ భూకంపం వల్ల రోడ్లు, వంతెనలు, సమాచార వ్యవస్థ దెబ్బతినటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టు అధికారులు తెలిపారు.
మయన్మార్‌ను పాలిస్తున్న జుంటా నేతృత్వంలోని మిలటరీ సర్కార్, భూకంపం సంభవించిన శుక్రవారం నాడు కూడా తిరుగుబాటు దళాల స్థావరాలపై వైమానిక దాడులు చేపట్టిందని తెలిసింది. షాన్ రాష్ట్రంలో నాన్గోలో జరిగిన వైమానిక దాడుల్లో ఏడుగురు చనిపోయారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.