Vladimir Putin | భారత్-రష్యా మధ్య మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. రాజకీయంగా, దౌత్యపరంగా రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. రష్యా చమురు కొనుగోలు కారణంగా భారత్‌పై అగ్రరాజ్యం అమెరికా విధించిన అధిక టారిఫ్‌లతో మాస్కోతో న్యూఢిల్లీ బంధం మరింత బలపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌పై రష్యా అధినేత పుతిన్ (Vladimir Putin) తన ప్రేమను చాటుకున్నారు. భారతీయ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఇండియన్ ఫిల్మ్స్ (Indian Cinema)కు రష్యాలో భారీ ప్రజాదరణ ఉందని అన్నారు.
నల్లసముద్రంలోని రిసార్ట్ నగరం సోచిలో జరిగిన చర్చా కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాలపై తన ప్రేమను చాటుకున్నారు. ‘భారత దేశమే కాదు.. భారతీయ సినిమాలంటే మాకు చాలా ఇష్టం. అందుకే భారతీయ సినిమాలను రాత్రి, పగలు ప్రసారం చేసేందుకు ఓ ప్రత్యేక టెలివిజన్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాం. బహుశా భారత సినిమాల ప్రసారానికి ప్రత్యేక టెలివిజన్ ఛానల్ ఉన్న ఏకైక దేశం రష్యానే కావొచ్చు’ అని పుతిన్ వ్యాఖ్యానించారు.
రష్యా-భారత్ మధ్య రాజకీయంగా, దౌత్యపరంగానే కాకుండా సాంస్కృతిక, మానవతా సంబంధాలు కూడా బలంగా ఉన్నాయని పుతిన్ తెలిపారు. తమ దేశంలో చాలా మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారన్నారు. భారతీయ సంస్కృతి, సినిమాల పట్ల రష్యన్లకు చాలా ఆసక్తి ఉందని పుతిన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా, సోవియట్ కాలం నుంచే భారతీయ సినిమాలకు రష్యాలో మంచి ఆదరణ ఉంది. రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి వంటి బాలీవుడ్ తారల పేర్లు రష్యాలోని ప్రతీ ఇంట్లో వినిపిస్తాయి. 1982లో మిథున్ చక్రవర్తి నటించిన బ్లాక్‌బస్టర్ ‘డిస్కో డాన్సర్’ సోవియట్ హయాంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది.
Also Read..
Operation Sindoor: పాక్‌కు చెందిన ఎఫ్-16, జే-17 యుద్ధ విమానాలను కూల్చేశాం: ఎయిర్ ఫోర్స్ చీఫ్
Aadhar Update | ఆధార్ అప్డేట్ చేసుకునే వాళ్లకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన సర్వీస్ ఛార్జెస్
Cough syrup | చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. కిడ్నీ వైఫల్యంతో తొమ్మిది మంది మృతి