Cough syrup | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని చింద్వారా (Chhindwara) జిల్లాలో కలుషిత దగ్గు మందుల (Cough syrup) కారణంగా వరుసగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కిడ్నీ వైఫల్యం (kidney failure) కారణంగా కేవలం పక్షం రోజుల్లోనే తొమ్మిది మంది పిల్లలు మరణించడం దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. ఈ మరణాలకు దగ్గుమందే కారణమని తేలింది.
ఆ చిన్నారులు వినియోగించిన రెండు రకాల దగ్గు సిరప్లు విషపూరితమైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం వాటిని నిషేధించింది. జిల్లాలోని పరాసియా, న్యూటన్ చిక్లి, సమీప గ్రామాలకు చెందిన ఐదేళ్ల లోపు పిల్లలు జ్వరం, జలుబు, దగ్గు బారిన పడ్డారు. స్థానిక డాక్టర్లు జ్వరం మందులతోపాటు దగ్గు సిరప్లు రాశారు. వాటిని వాడిన పిల్లలు కొద్దిగా కోలుకున్నారు. ఆ తర్వాత వారిలో కిడ్నీ సమస్యలు తలెత్తాయి. మెరుగైన చికిత్స కోసం కొందరు పిల్లలను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు చిన్నారులు మరణించారు. సెప్టెంబర్ 7 నుంచి 20 వరకు 15 రోజుల్లో మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కారణంగా ఆరుగురు పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
కిడ్నీ బయాస్పీలో షాకింగ్ విషయం బయటపడింది. ఔషధ విష ప్రయోగానికి సంబంధించిన విషపూరిత రసాయనం డైథిలిన్ గ్లైకాల్ కారణంగా చిన్నారుల కిడ్నీలు పాడైనట్లు నిర్ధారణ అయ్యింది. మరోవైపు బాధిత చిన్నారులు ఎక్కువగా కోల్డ్రిఫ్, నెక్స్ట్రో-డీఎస్ దగ్గు సిరప్లు వినియోగించినట్లు అధికారుల దర్యాప్తులో తెలిసింది. దీంతో చింద్వారా కలెక్టర్ శీలేంద్ర సింగ్ అప్రమత్తమయ్యారు. ఆ రెండు రకాల దగ్గు సిరప్‌ల అమ్మకాలను జిల్లా అంతటా నిషేధించారు. డాక్టర్లు, మందుల షాపులతో పాటు ప్రజలను అలెర్ట్ చేశారు. ప్రభావిత గ్రామాల నీటి నమూనాలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదని కలెక్టర్ తెలిపారు. చిన్నారుల మూత్రపిండాల వైఫల్యానికి కలుషిత ఔషధం కారణమన్నది బయాప్సీ నివేదిక బలంగా సూచిందని వెల్లడించారు.
Also Read..
Taliban Minister | త్వరలో భారత పర్యటనకు తాలిబన్ మంత్రి
Sonam Wangchuk | నా భర్తను కలవనివ్వట్లేదు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ భార్య
Bomb Threat | తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు