హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ) : ప్రజాసమస్యల పరిషారమే లక్ష్యంగా సీపీఐ ఉద్యమించబోతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలతోపాటు ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రెండ్రోజులపాటు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తకెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ, సభ్యులు శంకర్, బాలనర్సింహతో కలిసి బుధవారం ఆయన మీడియా సమావేశంలో రాష్ట్ర సమితి నిర్ణయాలను వెల్లడించారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.
మిత్రధర్మంపై తేల్చుకుంటాం
తమతో మిత్రధర్మం పాటిం చే విషయంలో కాంగ్రెస్తో తేల్చుకుంటామని కూనంనేని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం చేపట్టి రెండున్నరేండ్లు కావస్తున్నా ప్రజాసమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం కారణంగా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. రైతు భరోసా నిధులు ఇప్పటికే ఒక దఫా పెండింగ్ ఉండగా, రెండో దఫా సమయం కూడా మించిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అసలు రైతుభరోసా నిధులు ఇస్తుందా.. ఇవ్వదా.. అనేది స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు సీపీఐ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఎవరు పార్టీ ఫిరాయించినా తక్షణమే వారి సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లాభాల్లో ఉన్న సింగరేణిని పాలకుల అనాలోచిత నిర్ణయాలు, మితిమిరిన రాజకీయ జోక్యంతో నష్టాల్లోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే సింగరేణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నేడు సీపీఐ కార్యాలయానికి దేవ్జీ బృందం! ; కూనంనేనితో భేటీ
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి నేతృత్వంలోని మాజీ మావోయిస్టుల బృందం గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రానున్నది. ఈ మేరకు వారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇతర పార్టీ ముఖ్యులతో భేటీ కానున్నారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ముగిసిన అనంతరం కూనంనేని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమసమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుందామని .. అందుకు జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులంతా మాతృపార్టీ అయిన సీపీఐలో చేరాలని కూనంనేని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మిత్రధర్మం పాటించడం లేదని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు అవుతున్నా.. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం లేదని కూనంనేని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తీరుమార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజాఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో మాజీ మావోయిస్టుల బృందం సీపీఐ కార్యాలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారిం ది. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, డీజీపీ అనుమతితో గంట సమయంలో మాత్రమే ఈ భేటీ జరుగుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.