Bomb Threat | చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసంతో పాటు రాజ్ భవన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సీఎం స్టాలిన్ నివాసంతో రాజ్‌భవన్‌లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమిళనాడు పోలీసులకు సమాచారం చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీఎం నివాసంతో పాటు రాజ్‌భవన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు పేర్కొన్నారు. హోక్స్ కాల్స్ అని తేల్చారు. అయినప్పటికీ అల్వార్ పేట్‌లోని సీఎం నివాసంతో పాటు, గవర్నర్ నివాసం రాజ్ భవన్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కడ్నుంచి, ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.