Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం (Israel-Hamas War) తీవ్ర రూపం దాల్చుతోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రధానంగా గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో యుద్ధ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు వైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 5 వేల మందికి గాయాలయ్యాయి. ఈ యుద్ధంలో పలువురు అమెరికన్లు (Americans) కూడా మరణించినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. అయితే, ఎంత మంది మరణించారు..? అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు. మరికొందరు అమెరికన్ పౌరులు అదృశ్యమైనట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం బాసటగా నిలిచింది.
ఇజ్రాయెల్‌కు సాయంగా ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తో పాటూ యుద్ధ విమానాలను పంపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ (Joe Biden) ఆదివారం ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తోపాటు యుద్ధ విమానాలు, నౌకలను ( US ships) పెంటగాన్ రంగంలోకి దింపింది. ఇప్పటికే అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు మధ్యదరా సముద్రంలో ఇజ్రాయెల్‌కు బయలుదేరాయి. భూ, వాయు మార్గాల్లో దాడులు చేసే క్షిపణుల్ని ఈ నౌకల ద్వారా పంపుతోంది. అంతే కాదు ఈ యుద్ధ నౌకల్లో దాడుల్ని ముందుగానే గుర్తించే అత్యాధునిక నిఘా పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉంచింది.
అరబ్ దేశాల మద్దతు…
హమాస్ ముఖ్యంగా అమెరికా పాలసీలను వ్యతిరేకిస్తుంది. దీనికి ఇరాన్, సిరియా, యెమెన్, లెబనాన్‌లోని హెజ్బోల్లా గ్రూప్‌ల మద్దతు ఉంది. మరోవైపు అనేక అరబ్ దేశాలు హమాస్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్, అమెరికా దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. ఈ మేరకు 2018లో ఐరాసలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అమెరికా ఓటు కూడా వేసింది.
Also Read..
Israel-Hamas War | మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి.. 260 మంది మృతి