LPG ships : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చమురు సంక్షోభం మొదలైంది. తమపై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో హార్మూజ్ జలసంధికి ఇరువైపులా వివిధ దేశాలకు చెందిన వందలాది నౌకలు చిక్కుకుపోయాయి. ఈ క్రమంలో జలసంధిగుండా భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ ఇటీవల పేర్కొన్నది.
ఆ మేరకు శనివారం ఉదయం భారత జెండాలు ఉన్న రెండు ఎల్పీజీ నౌకలు సురక్షితంగా హార్మూజ్ జలసంధిని దాటాయి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడించింది. శివాలిక్, నందాదేవి పేర్లు కలిగిన నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌కుమార్ సిన్హా తెలిపారు. ఈ నౌకల్లో సుమారు 92 వేల టన్నుల ఎల్పీజీ ఉందని, మార్చి 16 లేదా 17వ తేదీన ఈ నౌకలు భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.
దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ఊరట కలిగిస్తున్నది. అదేవిధంగా గృహవినియోగ సిలిండర్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అవసరం లేకున్నా చాలామంది బుకింగ్ చేస్తున్నారని, దాంతో డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారని పేర్కొంది. బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలని రాష్ట్రాలను కోరామని, తాము కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపింది.