BLA | దాయాది పాకిస్థాన్ (Pakistan)కు అగ్రరాజ్యం అమెరికా (America) షాకిచ్చింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Balochistan Liberation Army), దానికి చెందిన మజీద్ బ్రిగేడ్ (Majeed Brigade)ని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా (foreign terrorist organisation) గుర్తించాలంటూ యూఎన్ భద్రతామండలిలో చైనా,పాక్ చేసిన అభ్యర్థనను అమెరికా అడ్డుకుంది.
బలూచ్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్పై ఆంక్షలు విధించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్-చైనా ఉమ్మడి బిడ్‌ను సమర్పించాయి. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. ISIL-K, అల్ ఖైదా, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్, బలోచ్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్ సహా పలు ఉగ్రవాద గ్రూపులు ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాదం పాక్ ప్రాథమిక జాతీయ భద్రతకు ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభ్యర్థన మేరకు ఆ ఉగ్రసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, పాక్-చైనా చేసిన ఈ అభ్యర్థనను యూఎస్, యూకే, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. ఈ గ్రూపులను ఉగ్ర సంస్థలుగా గుర్తించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నాయి.
కాగా, పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ (Pak army chief) సయ్యద్ అసిం మునీర్ (Asim Munir) పర్యటన వేళ.. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Balochistan Liberation Army), దానికి చెందిన మజీద్ బ్రిగేడ్ (Majeed Brigade)ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా (foreign terrorist organisation) గుర్తిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బీఎల్ఏని 2019లోనే.. ‘స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్డీజీటీ)’ జాబితాలో చేర్చిన అమెరికా.. మజీద్ బ్రిగేడ్‌ను కూడా బీఎల్ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతనెల కీలక ప్రకటన చేశారు.
ఇటీవలే కాలంలో బీఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ పాక్‌లోని పలు ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పాక్ సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు నిర్వహిస్తోంది. 2024లో కరాచీ ఎయిర్పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీపై బీఎల్ఏ దాడులు చేపట్టింది. ఇక ఈ ఏడాది అంటే 2025లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ చేసి దాదాపు 300 మంది ప్యాసింజర్లను బందీలుగా చేసుకుంది. పాక్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వారిని విడిపించింది. ఈ రైలు హైజాక్ ఘటనలో 31 మంది పౌరులు, పాక్ సైనికులు చనిపోయారు. ఇలా వరుస దాడులతో బలూచ్ ఆర్మీని ఉగ్రసంస్థగా గుర్తించాలని పాక్ కోరుతూ వస్తోంది.
Also Read..
PM Modi | బర్త్‌డే గిఫ్ట్‌గా కదంబ చెట్టు.. తన నివాసంలో నాటిన ప్రధాని మోదీ
Actor Vijay | టీవీకే విజయ్ ఇంట్లో భద్రతా వైఫల్యం
Bomb threat | బాంబే హైకోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్..!