Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక ప్రకటన చేశారు. రష్యాకు వ్యతిరేకంగా రెండోదశ (second phase) ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. క్రెమ్లిన్ నుంచి చమురు కొనుగోలు (Russian oil) చేసే భారత్ సహా ఇతర దేశాలపై రెండో దశ ఆంక్షల ప్రభావం పడనున్నట్లు వెల్లడించారు.
ఉక్రెయిన్‌పై రష్యా నిన్న భీకర దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కీవ్‌లోని కీలకమైన ప్రభుత్వ సముదాయాన్ని మాస్కో దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడి తర్వాత ట్రంప్ నుంచి రెండో దశ ఆంక్షల ప్రకటన వెలువడింది. రష్యా దాడి నేపథ్యంలో వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు ట్రంప్‌కు పలు పశ్నలు సంధించారు. రష్యా లేదా చమురు కొనుగోలు చేసే దేశాలపై చర్యలు తీసుకుంటారా..? అని అధ్యక్షుడిని ప్రశ్నించారు. దీనికి ‘అవును, అందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ట్రంప్ సమాధానమిచ్చారు.
రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై మరిన్ని ఆంక్షలు..
యుద్ధం ఆపి, ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు వచ్చేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా, ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలపై మరోసారి సుంకాలతో పాటు ఆంక్షలను విధించాలని వాషింగ్టన్, దాని యూరోపియన్ మిత్ర దేశాలు యోచిస్తున్నట్టు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ (Scott Bessent) ఆదివారం తెలిపిన విషయం తెలిసిందే. అమెరికా, యూరోపియన్ యూనియన్లు జోక్యం చేసుకుని రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు, టారిఫ్‌లు విధించగలిగితే రష్యన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడమే కాక, అది రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు తీసుకువస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో యూరోపియన్ భాగస్వాముల సమన్వయం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
ఉక్రెయిన్‌పై 800 డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) విరుచుకుపడింది. 800 డ్రోన్లు, 13 క్షిపణులతో సెంట్రల్ కీవ్‌లో మంత్రులు నివసించే క్యాబినెట్ భవనంతో పాటు పలు నగరాలు, పట్టణాలపై వైమానిక దాడికి దిగింది. తొలుత రష్యా వాయుసేన సెంట్రల్ కీవ్‌లో మంత్రులు నివసించే భవనం లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ దాడిలో ఏడాది చిన్నారి సహా ముగ్గురు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఉక్రెయిన్.. రష్యాలో బ్రయాన్స్లోని డ్రుజ్బా చమురు పైపులైన్‌పై దాడి చేసింది. రెండు దేశాలు కూడా ప్రభుత్వ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు జరుపుకున్నాయి.
ఈ దాడిలో ఇతర ఉక్రెయిన్ నగరాలను కూడా రష్యా లక్ష్యంగా చేసుకుంది. క్రెమెన్‌చుక్‌లో డజన్ల కొద్దీ విద్యుత్ సౌకర్యాలు రష్యా దాడితో దెబ్బతిన్నాయి. అలాగే అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరమైన క్రివీరిహ్‌లో కూడా క్షిపణులు రవాణా, మౌలిక సదుపాయాలపై దాడులు జరిపాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా జరిపిన అతిపెద్ద గగనతల దాడుల్లో ఇదొకటి.
Also Read..
భారత్‌పై మరోసారి సుంకాలు!.. అమెరికా తాజా బెదిరింపులు
Russia attack | ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 800 డ్రోన్లు, క్షిపణులతో ఎటాక్