వాషింగ్టన్, సెప్టెంబర్ 7: ఒక పక్క ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న వాణిజ్య సంబంధాల మెరుగుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ భారత్‌పై మరోసారి టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ యంత్రాంగం బెదిరింపులకు పాల్పడుతున్నది. యుద్ధం ఆపి, ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు వచ్చేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా, ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలపై మరోసారి సుంకాలతో పాటు ఆంక్షలను విధించాలని వాషింగ్టన్, దాని యూరోపియన్ మిత్ర దేశాలు యోచిస్తున్నట్టు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ ఆదివారం తెలిపారు.
అమెరికా, యూరోపియన్ యూనియన్లు జోక్యం చేసుకుని రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు, టారిఫ్‌లు విధించగలిగితే రష్యన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడమే కాక, అది రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు తీసుకువస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో యూరోపియన్ భాగస్వాముల సమన్వయం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.