Russia attack : ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఏకంగా 800కుపైగా డ్రోన్లు (Drones), క్షిపణుల (Missiles) ను ప్రయోగించింది. యుద్ధం మొదలు ఈ స్థాయిలో గగనతల దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి. అంతేగాక తొలిసారి ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ ప్రతినిధి యూరీ ఇన్హాత్ ఈ దాడులను ధ్రువీకరించారు. ప్రత్యర్థి దేశం 13 క్షిపణులను ప్రయోగించిందన్నారు. 747 డ్రోన్లు, నాలుగు క్షిపణులను నేలకూల్చినట్లు తెలిపారు. 54 డ్రోన్లు, తొమ్మిది క్షిపణులు కీవ్ సహా దేశవ్యాప్తంగా 37 ప్రాంతాలను తాకినట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఒక చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
రష్యా దాడుల్లో కీవ్‌లోని మంత్రుల భవనం పాక్షికంగా ధ్వంసమైంది. అందులో ఉక్రెయిన్ మంత్రుల నివాసాలు, కార్యాలయాలు ఉన్నాయి. శత్రుదేశం దాడిలో తొలిసారి ఓ ప్రభుత్వ భవనం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ ప్రధాని యూలియా స్వైరెదెన్కో తెలిపారు. ‘భవనాన్ని పునర్నిర్మించుకోవచ్చు కానీ ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కదా’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రపంచ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాలని స్వైరెదెన్కో పిలుపునిచ్చారు. అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సంకల్పంతో క్రెమ్లిన్ దుశ్చర్యలను అడ్డుకోవచ్చన్నారు. మరోవైపు కీవ్ సైతం రష్యాకు చెందిన ద్రుజ్హబా చమురు పైప్‌లైన్‌పై ప్రతీకార దాడులు చేసింది.