Tariffs | అగ్రరాజ్యం అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం (Tariffs War) తారా స్థాయికి చేరింది. ఇప్పటికే రెండు దేశాలు పోటాపోటీగా టారిఫ్‌లు విధించుకున్న విషయం తెలిసిందే. చైనా ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 145 శాతం టారిఫ్‌లు విధించింది. అందుకు ప్రతిగా చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, చైనా ఉత్పత్తులపై సుంకాలను 245 శాతానికి పెంచినట్లు వైట్‌హౌస్ తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫ్యాక్ట్ షీట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.
సాధారణంగా చైనాపై సుంకాలు పెంచుతున్న విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా మీడియా ముందుకొచ్చి ప్రకటిస్తుంటారు. అలాంటి ప్రకటనలు చేస్తున్నప్పుడు అధికారులు కాస్త హడావిడి చేస్తుంటారు. అయితే, ఈ సారి అలాంటి హడావిడి లేకుండానే ఇంత మొత్తానికి టారిఫ్‌లు పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ట్రంప్ సర్కార్ నిజంగానే చైనాపై ప్రస్తుత సుంకాలను 145 శాతం నుంచి 245 శాతానికి పెంచిందా..? లేక టైపింగ్ మిస్టేకా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలపై డ్రాగన్ స్పందించింది.
నిర్దిష్ట పన్ను రేటు ఎంతన్నది అమెరికాని అడగాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. ‘అసలు సుంకాలు ఎంత అనే విషయాన్ని నేరుగా అమెరికానే అడగాలి. సుంకాలు, వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు. చైనా ఇలాంటి యుద్ధాలతో పోరాడాలనుకోవడం లేదు. అలాగే వాటికి భయపడదు కూడా’ అని జియాన్ నొక్కి చెప్పారు.
వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనాపై అమెరికా మరోసారి పంజా విసిరింది. చైనా దిగుమతి వస్తువులపై సుంకాన్ని 245 శాతానికి పెంచేసింది. తమ వస్తువులపై ప్రతీకారంగా చైనా దిగుమతి సుంకాలు పెంచిన నేపథ్యంలో ఈ చర్యకు దిగినట్లు శ్వేతసౌధం బుధవారం వెల్లడించింది. అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ విధానంలో భాగంగా .. ఇటీవల ట్రంప్ దిగుమతి సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే. చాలా వరకు దేశాలపై సుంకాన్ని ఆయన పెంచారు. కానీ చైనాపై మాత్రం ఆ పెంపు మరీ ఎక్కువగా ఉన్నది.
Also Read..
US Tariff: చైనాపై విరుచుకుపడ్డ అమెరికా.. 245 శాతానికి దిగుమతి సుంకం పెంపు
Donald Trump | డబ్బులిస్తాం యూఎస్‌ను వీడండి.. అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్
Donald Trump | ట్రంప్ సర్కార్‌పై న్యాయ పోరాటానికి దిగిన విద్యార్థులు.. వీసాల రద్దుపై దావా!