Poorna | టాలీవుడ్ నటి షమ్నా ఖాసీం అలియాస్ పూర్ణ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఈ అందాల తార రెండోసారి తల్లిగా మారింది. శనివారం (మార్చి 14) ఉదయం తాను పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు పూర్ణ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.ఈ సందర్భంగా పూర్ణ ఒక భావోద్వేగపూరిత పోస్ట్‌ను షేర్ చేసింది. “అల్లాహ్ ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు మా ఇంట పాప పుట్టింది. ఆమె మా జీవితంలోకి వచ్చిన అమూల్యమైన కానుక. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ జరిగినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సమయంలో సహకరించిన ఆసుపత్రి వైద్య బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు” అని ఆమె పేర్కొంది.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పూర్ణ సినిమా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకుంది. 2022లో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2023లో హమదన్ ఆసిఫ్ అలీ అనే బాబు పుట్టాడు. అనంతరం గత ఏడాది ఆగస్టులో మరోసారి గర్భవతి అయిన పూర్ణ ఇప్పుడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మలయాళ నటి అయినప్పటికీ పూర్ణకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె ‘సీమ టపాకాయ్’ సినిమాతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘అవును’, ‘లడ్డూ బాబు’, ‘నువ్వలా నేనిలా’, ‘అవును 2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ‘సిల్లీ ఫెలోస్’, ‘దసరా’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్గా, సహాయక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పూర్ణ ఇటీవల మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాటతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పలు టీవీ, డ్యాన్స్ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉంది.