Donald Trump | అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలూ పోటాపోటీగా ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకుంటున్నాయి. డ్రాగన్‌పై ట్రంప్ 125 శాతం ప్రతీకార సుంకాలు విధించగా.. ప్రతిగా అగ్రరాజ్యంపై చైనా 84 శాతం టారిఫ్‌లు విధించింది. ఈ టారిఫ్ వార్ వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping)పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసల వర్షం కురిపించారు. జిన్‌పింగ్ చాలా స్మార్ట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
‘జిన్‌పింగ్ చాలా స్మార్ట్. తెలివైన వ్యక్తి. ఎప్పుడు ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. సుంకాలపై వాళ్లు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు జిన్‌పింగ్ నుంచి మాకు ఫోన్ కాల్ వస్తుందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. చైనాపై అధిక టారిఫ్‌లు విధించి మరీ ఆ దేశాధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార సుంకాలపై నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేశారు. చైనా మినహా అన్ని దేశాలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. చైనాపై మాత్రం వెంటనే పెంచిన సుంకాలు అమల్లోకి రాగా.. తాజా సవరింపులతో డ్రాగన్‌పై ప్రతీకార సుంకాలు గరిష్టంగా 125 శాతానికి చేరడం గమనార్హం. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల పెంచిన పన్నుతో ఇది 54 శాతానికి చేరుకున్నది. దీనిపై డ్రాగన్ దీటుగా స్పందించింది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది (China tariffs).
దీనిపై ఆగ్రహించిన ట్రంప్ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గాలంటూ డ్రాగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టారిఫ్‌లు 104 శాతానికి చేరాయి. అయినా చైనా వెనక్కి తగ్గలేదు. అమెరికాపై 84 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇవి గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో మళ్లీ అదనపు సుంకాల పోటు తప్పలేదు. చైనా నిర్ణయంతో ట్రంప్ బుధవారం మరో 21 శాతం బాదారు. దీంతో చైనాపై ప్రతీకార సుంకాలు 125 శాతానికి చేరింది. మొత్తానికి ఈ పరస్పర సుంకాలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత పెరిగినైట్టెంది.
Also Read..
Trump Tariffs | ట్రంప్ టారిఫ్‌లు వాయిదా.. చైనా మినహా మిగతా దేశాలపై 90 రోజులు ఆపేసిన అమెరికా
Donald Trump | ఔషధాలపై సుంకాలు.. ఫార్మా ఉత్పత్తులనూ వదలని డొనాల్డ్ ట్రంప్!
Xi Jinping | అమెరికా ప్రతీకార టారిఫ్‌ల దెబ్బ.. చైనా మాటల్లో ఎంత మార్పబ్బా..!