Trump Tariffs | బీజింగ్/వాషింగ్టన్, ఏప్రిల్ 9: అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార సుంకాలపై నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేశారు. చైనా మినహా అన్ని దేశాలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. చైనాపై మాత్రం వెంటనే పెంచిన సుంకాలు అమల్లోకి రాగా.. తాజా సవరింపులతో డ్రాగన్‌పై ప్రతీకార సుంకాలు గరిష్టంగా 125 శాతానికి చేరడం గమనార్హం. మరోవైపు అమెరికాపై చైనా సుంకాలు 84 శాతానికి పెరిగాయి. ఇవి గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. మొత్తానికి ఈ పరస్పర సుంకాలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత పెరిగినైట్టెంది. ట్రంప్ హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో మళ్లీ అదనపు సుంకాల పోటు తప్పలేదు.
కాగా, భారత్ సహా అనేక దేశాలు తమ వస్తూత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తూ తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే అన్ని దేశాలు తమ వస్తువులపై సుంకాలు తగ్గించాలని గత కొన్ని రోజులుగా చేస్తున్న విజ్ఞప్తులను ట్రంప్ ఎట్టకేలకు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే చైనాపై మాత్రం తగ్గేదేలే అన్నారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల పెంచిన పన్నుతో ఇది 54 శాతానికి చేరుకున్నది. ఆపై మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మరో 21 శాతం బాదారు. దీంతో 125 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో చైనా ఎలా స్పందిస్తుందోనన్న భయాలు అంతటా నెలకొన్నాయి.
ట్రంప్ సెల్ఫ్ గోల్: రఘురామ్ రాజన్
పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించడాన్ని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తప్పుపట్టారు. ఇది సెల్ఫ్ గోల్ లాంటిదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతీకార సుంకాల నిర్ణయం వాణిజ్య రంగంలో అనిశ్చితికి దారితీయనున్నదని, అగ్రగామి ఇరు దేశాలు అనుసరిస్తున్న విధానాలు ఆయా దేశాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని, ఇదే సమయంలో భారత్‌కు కొంతమేర లాభం చేకూరే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ కీలక నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయని, భారతీయ ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడంతోపాటు వాణిజ్య చర్చలకు ఇది సరైన సమయమన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం సెల్ఫ్ గోల్ లాంటిదని, స్వంత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయగలదని రాజన్ హెచ్చరించారు. నిరుద్యోగం తక్కువస్థాయిలో కొనసాగుతున్నదని, మరోవైపు ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించడంతో ఇవి అనుకూల స్థాయిలో ఉన్న ప్రస్తుత తరుణంలో ట్రంప్ బాంబు పేల్చాడని ఇది క్షేమకరం కాదని అభిప్రాయపడ్డారు. అమెరికా ఎగుమతులపై ఆధారపడివున్న వియత్నాం లాంటి దేశాలకు పెద్ద ఎదురుదెబ్బ అన్నారు.