Donald Trump | న్యూయార్క్, ఏప్రిల్ 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్మా ఉత్పత్తులను వదలడం లేదు. ఇప్పటికే పలు ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించిన ఆయన..త్వరలో ఔషధాలపై టారిఫ్‌లను విధించబోతున్నట్టు సంకేతాలిచ్చారు. ఎంతమేర విధించేదానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ దెబ్బకు దేశీయ ఫార్మా కంపెనీల షేర్లు కుప్పకూలాయి. మరోవైపు, విదేశాల్లో ఉన్న ప్లాంట్లను అమెరికాకు తరలిస్తే ఆయా కంపెనీలకు రాయితీలు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. ఈ నిర్ణయంతో అత్యధికంగా ఔషధాలను ఎగుమతి చేస్తున్న భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపనున్నది.
2024లో భారత్ నుంచి అమెరికాకు 12.73 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయి. అమెరికా హెల్త్‌కేర్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న దేశీయ ఫార్మా సంస్థలకు ఇది ఎదురుదెబ్బలాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎగుమతులతో అమెరికా హెల్త్‌కేర్ రంగం భారీ స్థాయిలో లాభపడుతున్నదని, 2022లో 219 బిలియన్ డాలర్ల మేర లబ్దిపొందింది. 2013 నుంచి 2022 మధ్యకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు 1.3 ట్రిలియన్ డాలర్ల మేర లబ్దిపొందింది. వచ్చే ఐదేండ్లలో జనరిక్ ఔషధాలతో ఆయ దేశానికి 1.3 ట్రిలియన్ డాలర్ల మేర ఆదాకానున్నదని పేర్కొంది.
రాష్ట్ర ఫార్మా సంస్థలకు దెబ్బ
రాష్ర్టానికి చెందిన ఫార్మా సంస్థలకు ఇది చేదువార్త. అమెరికా ఎగుమతులపై అత్యధికంగా ఆధారపడివున్న రాష్ట్ర ఫార్మా సంస్థలకు ట్రంప్ నిర్ణయం షాక్‌నకు గురి చేసింది. అమెరికాకు ఎగుమతవుతున్న దేశీయ ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 28.16 శాతంగా ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం తెలంగాణ నుంచి వ్యాక్సిన్లు, ఫార్మాస్యూటికల్ ఔషధాలు 150 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2023-24లో ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి రూ.36,893 కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయి.
మొత్తం దేశీయ ఎగుమతుల్లో రూ.1,16,182 కోట్ల ఎగుమతుల్లో వీటి వాటా 32 శాతంగా ఉన్నది. ఔషధాల దిగుమతులపై భారీ సుంకాలను విధించే ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించడంతో ఫార్మా సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ సిద్ధార్థ తెలిపారు. దీంతో బ్లూ జెట్ హెల్త్‌కేర్ షేరు అత్యధికంగా 10 శాతం నష్టపోగా..మార్క్సన్స్ ఫార్మా షేరు 6.69 శాతం, వొకార్డ్ 5.14 శాతం, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ 4.35 శాతం, అరబిందో ఫార్మా 3.54 శాతం చొప్పున పతనం చెందాయి. వీటితోపాటు లుపిన్ 3.09 శాతం, గ్లాండ్ ఫార్మా 2.27 శాతం, సన్ ఫార్మా 2.18 శాతం, డాక్టర్ రెడ్డీస్ 1.20 శాతం నష్టపోయాయి.