Xi Jinping : అమెరికా (USA) ప్రతీకార టారిఫ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా (China).. పొరుగుదేశాలతో సంబంధాల విషయంలో తన స్వరం మార్చింది. తాజాగా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) మాట్లాడుతూ.. పొరగు దేశాలతో విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సరఫరా వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుని వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పారు.
పొరుగుదేశాలతో సంబంధాలకు సంబంధించి బీజింగ్‌లో రెండు రోజులుగా జరుగుతున్న కీలక సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడారు. భవిష్యత్తులో పొరుగు దేశాలతో కలిసి పనిచేసే సమాజాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇందుకోసం కొత్త వ్యవస్థను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు జరగాలని చెప్పారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
డొనాల్డ్ ట్రంప్ తీరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా పొరుగుదేశాలతో సత్సంబంధాలే మేలని గుర్తించినట్లు తెలుస్తోంది. భారత్ సహా జపాన్, దక్షిణ కొరియా వంటి పొరుగు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్-చైనాలు జట్టుకట్టాలని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం కూడా తాజాగా పేర్కొనడం ఇందుకు బలాన్నిస్తోంది.
ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై మరో 50 శాతం టారిఫ్‌లు విధించారు. దాంతో అక్కడ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు 104 శాతానికి చేరాయి. అయితే, ఈ ప్రతికూల పరిస్థితులను దీటుగా ఎదుర్కొంటామని చెబుతోన్న డ్రాగన్, తగినవిధంగా బదులిచ్చేందుకు విధానపరంగా తమ వద్ద ఆయుధాలున్నాయని పేర్కొంది. ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌ను 84 శాతానికి పెంచింది.