న్యూఢిల్లీ: త్రిపురలో ఓ గ్రామస్థుడిని చంపిన ముగ్గురు బంగ్లాదేశీ స్మగ్లర్లను గ్రామస్థులు హతమార్చారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అక్టోబర్ 15న జరిగిన ఈ ఘటన భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదానికి దారితీసింది. హత్యకు గురైన ముగ్గురు బంగ్లాదేశీయులకు న్యాయం జరగాలని, దీనిపై తక్షణమే నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరగాలని బంగ్లాదేశ్ డిమాండు చేసింది. దీన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఆరోపించింది.
బంగ్లాదేశ్ ఆరోపణలను తోసిపుచ్చిన విదేశీ వ్యవహారాల శాఖ భారత భూభాగంలో మూడు కిలోమీటర్ల లోపల ఈ ఘటన జరిగినట్లు ప్రకటించింది. బిద్యాబిల్ గ్రామంలో పశువులను దొంగలించడానికి బంగ్లాదేశీ స్మగ్లర్లు ప్రయత్నించినట్లు కేంద్రం తెలిపింది. దీన్ని చూసిన స్థానికులు స్మగ్లర్లను ఎదుర్కొనడానికి ప్రయత్నించారని, పదునైన ఆయుధాలతో దాడి చేసిన స్మగర్లపై ఆత్మరక్షణార్థం గ్రామస్థులు ఎదురుదాడి చేశారని ప్రభుత్వం పేర్కొంది.