న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును ట్రంప్ ప్రభుత్వం 1 లక్ష డాలర్లకు(రూ. 88లక్షలు) పెంచడాన్ని సవాలుచేస్తూ అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది చట్టవ్యతిరేక నిర్ణయమని, దీని వల్ల ప్రపంచంలోని నైపుణ్యం గల ఉద్యోగులను అమెరికా కంపెనీలు కోల్పోతాయని పిటిషన్లో ఆరోపించింది. వీసా ఫీజు పెంపు అమెరికా ఇమిగ్రేషన్, నేషనాలిటీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, ప్రభుత్వ వాస్తవిక ప్రాసెసింగ్ ఖర్చులకు లోబడే ఫీజు ఉండాలి తప్ప ప్రతీకారంగా లేక ఆంక్షలు విధిస్తున్నట్లు ఉండరాదని చాంబర్ ఆఫ్ కామర్స్ తన పిటిషన్లో పేర్కొంది. అధికారిక ప్రకటన ద్వారా ఫీజు పెంపు విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాలను అతిక్రమించారని కూడా పిటిషనర్ వాదించారు.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపును అమలు చేయకుండా హోంల్యాండ్ సెక్యూరిటీ, అమెరికా విదేశాంగ శాఖను అడ్డుకోవాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త హెచ్-1బీ దరఖాస్తుల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు ట్రంప్ ప్రొక్లమేషన్‌పై సంతకం చేశారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుని హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవడానికే ఇమిగ్రేషన్ సంస్కరణలు తీసుకువచ్చినట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
అమెరికాలోకి పౌరేతరుల ప్రవేశాన్ని అడ్డుకునే అధికారం అధ్యక్షుడికి ఉందని, అయితే అధ్యక్షుడికి అమెరికా పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను ఉల్లంఘించే అధికారం లేదని చాంబర్ ఆఫ్ కామర్స్ తన పిటిషన్లో వాదించింది. హెచ్-1బీ వీసా ఫీజు పెంపు వల్ల చాలా అమెరికన్ కంపెనీలకు నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం కష్టతరంగా మారుతుందని, ముఖ్యంగా స్టార్టప్‌లు, చిన్న లేదా మధ్య తరహా సంస్థలకు నిపుణులైన విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేసే పరిస్థితి ఉండబోదని పిటిషనర్ పేర్కొన్నారు.