న్యూఢిల్లీ: దక్షిణ అమెరికా దేశం పెరూలో జెన్ జీ నిరసనలు వెల్లువెత్తాయి. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో గురువారం ఓ యువకుడు మరణించారు. 80 మంది పోలీసులు, 10 మంది పాత్రికేయులు సహా 100 మంది గాయపడ్డారు. జపనీస్ ఏనిమేషన్ చిత్రం ‘వన్ పీస్’లో న్యాయం కోసం పోరాడే లుప్ఫీ పాత్ర నిరసనకారులకు రోల్ మోడల్. పెరూ నూతన అధ్యక్షుడు జోస్ జెర్రీ తక్షణమే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్‌ను జెర్రీ తోసిపుచ్చారు. దేశంలో స్థిరత్వాన్ని కొనసాగించడమే తన కర్తవ్యమని తెలిపారు. తన బాధ్యత, నిబద్ధత అదేనన్నారు. నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారాలను ఇవ్వాలని పార్లమెంటును కోరారు. మాజీ ప్రెసిడెంట్ డీనా బొలువార్టేను పార్లమెంటు తొలగించిన తర్వాత ఈ నెల 10న జెర్రీ దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. జెర్రీ ఐదేళ్లలో ఆరో ప్రెసిడెంట్.