పటాన్చెరు రూరల్, అక్టోబర్ 17: గ్రామానికి నెలరోజులుగా తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పరిశ్రమలకు మాత్రం నీటిని వదులుతున్నారని చిట్కుల్ గ్రామస్తులు మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లో నీటి సరఫరా నిలిచిపోయిందని వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం మిషన్ భగీరథ ఈఈ విజయలక్ష్మి, ఏఈ కవిత గ్రామంలో పర్యటించారు. వడ్డ్డెర కాలనీ వద్ద ఉన్న సంప్, ట్యాంక్‌ను వారు పరిశీలించారు. గ్రామానికి మిషన్‌భగీరథ తాగునీరు నిలిచిపోయి దాదాపు నెల రోజులు అయ్యిందని, నెలరోజుల తర్వాత స్పందించడంపై అధికారులను మాజీ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, గ్రామస్తులు నిలదీశారు.
పంచాయతీగా ఉన్నప్పుడు సజావుగా తాగునీరు అందేదని, ఇప్పుడు తాగునీరు నెలకు రెండు రోజులకు మించి రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సరిపోను తాగునీరు అందజేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పాశమైలారం పరిశ్రమలకు తాగునీరు అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. కిర్బి వద్ద ఉన్న వాల్వ్ ద్వారా పరిశ్రమలకు ఎక్కువ నీరు సరఫరా జరిగేలా ఏర్పాటు చేశారని, వాల్వ్‌ను పరిశీలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో అధికారులు పాశమైలారం కిర్బి వద్ద సంప్వద్ద ఉన్న ప్రధాన వాల్వ్‌ను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. అక్కడ కేవలం పరిశ్రమలకు మాత్రమే పెద్దఎత్తున నీరు అందజేసేలా డిజైన్ ఉండడంతో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు నీరివ్వకుండా పరిశ్రమలకు నీళ్లమ్ముకుంటున్నారని రుజువైందని, రెండు రోజుల్లో తాగునీరు రానిపక్షంలో తామే జేసీబీలతో వచ్చి పైపులను సరిదిద్దుతామని విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. మిషన్ భగీరథ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎన్‌హెచ్ 65 జాతీయ రహదారి విస్తరణ కాంట్రాక్టర్ మెయిన్‌లైన్‌ను తరుచూ పగుల గొడుతుండడంతో నీటి సరఫరాకు అవాంతరాలు ఎదురవుతున్నాయని ఈఈ విజయలక్ష్మి తెలిపారు. చిట్కుల్, ముత్తంగి, ఇస్నాపూర్ జనాభా అధికంగా పెరుగుతుండటంతో నీటి సరఫరా సరిపోవడం లేదన్నారు. నీటి వాటా పెంచేందుకు ప్రతిపాదనలు చేశామన్నారు. కిర్బి వద్ద మరమ్మతులు చేసి ఇకమీదట తాగునీరు రోజు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆంజనేయులు, భుజంగం, కృష్ణ, బ్యాగరి వెంకటేశ్, సత్తార్మియా తదితరులు పాల్గొన్నారు.