US-India | మిత్రదేశం అంటూనే భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. రష్యా చమురు కొనుగోలు (Russian Oil) కారణం చూపి న్యూఢిల్లీపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూఢిల్లీ (India)పై అగ్రరాజ్యం మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే కారణం అని ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో (Peter Navarro) విమర్శించారు. దీన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణించారు. ఇదే సమయంలో అమెరికా సుంకాల నుంచి భారత్ తప్పించుకోవాలంటే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం వెంటనే ఆపేయాలని భారత్‌కు సూచించారు.
భారత్‌పై అమెరికా విధించిన 50శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ టెలివిజన్‌తో పీటర్ నవారో మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే ప్రధాన కారణం. రష్యా నుంచి రాయితీపై భారత్ ముడిచమురు కొనుగోలు చేయడమే యుద్ధంలో పుతిన్ దూకుడుకు ఆజ్యం పోసినట్లైంది. భారత్ ఆ పని చేయకపోతే యుద్ధం ఇంత కాలం కొనసాగి ఉండేది కాదు. ఇది ముమ్మాటికీ మోదీ యుద్ధమే. అయినా భారత్ తీరు చాలా విచిత్రంగా ఉంది. రష్యా విషయంలో మోదీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్యలకు భారత్ కూడా సహకరించాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ వెంటనే ఆపేయాలి. భారత్ ఆ దిశగా చర్యలు ప్రారంభిస్తే తర్వాతి రోజు నుంచే 25శాతం సుంకాలు అమల్లోకి వస్తాయి’ అని పీటర్ నవారో వ్యాఖ్యానించారు.
Also Read..
Donald Trump | మోదీకి ఫోన్‌చేసి యుద్ధం నేనే ఆపా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోట మళ్లీ పాత పాట
School Shooting | స్కూల్లో ప్రార్ధన చేస్తుండగా కాల్పులు.. ఇద్దరు చిన్నారులు మృతి.. నిందితుడు కూడా..
H-1B Visa | షాకింగ్ న్యూస్.. హెచ్-1బీ వీసాలు రద్దు చేసే యోచనలో అమెరికా!