H-1B Visa | న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసాలను నిలిపేసే సమయం ఆసన్నమైందా? అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్ మైక్ లీ ఈ కొత్త ప్రశ్నను ప్రజల ముందుంచారు. అత్యంత నైపుణ్యం గల భారతీయ టెక్నాలజీ ఉద్యోగులు అధికంగా లబ్ధి పొందుతున్న హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందన్న అభిప్రాయాన్ని ఆయన సూచనప్రాయంగా తన ఎక్స్ పోస్టులో వ్యక్తం చేశారు.
అమెరికా ఉద్యోగులను కాదని భారతీయ హెచ్-1బీ టెక్ ఉద్యోగులను తీసుకునేందుకు ప్రతిఫలంగా వాల్మార్ట్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ముడుపులు పుచ్చుకున్నట్లు వెల్లడించిన ఓ పోస్టుకు ప్రతిస్పందనగా లీ నెటిజన్లకు ఈ ప్రశ్న సంధించారు. రిపబ్లికన్ పార్టీలో అంతర్గతంగా తీవ్రమవుతున్న చర్చకు లీ వ్యాఖ్య అద్దం పడుతుంది. 1990లో ప్రవేశపెట్టిన హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ద్వారా అమెరికన్ సంస్థలు ప్రత్యేక వృత్తులలో నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అనుమతి లభిస్తుంది. మూడేళ్ల కోసం జారీ అయ్యే వీసా గరిష్ఠంగా ఆరేళ్ల వరకు పొడిగించుకోవచ్చు.
హెచ్-1బీ వీసాలను అమెరికా గరిష్ఠంగా ఏడాదికి 65,000 జారీచేస్తుంది. అమెరికాలో మాస్టర్స్ లేదా పీహెచ్డీ చేసిన వారి కోసం అదనంగా మరో 20,000 స్లాట్లు లభిస్తాయి. ఈ వీసాలు పొందుతున్న లబ్ధిదారులలో భారతీయ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉన్నారు. గత దశాబ్ద కాలంలో ఏటా జారీ అయ్యే హెచ్-1బీ వీసాలలో 60-70 శాతం భారతీయులే పొందారు. ఉదాహరణకు 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3.86 లక్షల హెచ్-1బీ వీసాలు జారీ కాగా అందులో 2.79 లక్షల వీసాలు భారతీయులకే దక్కాయి. 2024లో మొత్తం 3.99 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించగా అందులో 2.83 లక్షలు(71 శాతం) భారతీయులవే ఉన్నాయి.
ఈ ప్రోగ్రామ్ అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందన్న విమర్శలు రిపబ్లికన్లలో వ్యక్తమవుతున్నాయి. పెద్ద కంపెనీలు 9,000 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసి వేలాది విదేశీ వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయని, కొత్త ఉద్యోగాల కల్పన జరగడం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఏడాది జూలైలో ఓ పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించారు.