Terrorists Funeral | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. మురిద్కేలోని లష్కరే తోయిబా (ఎల్ఇటి)కి చెందిన మర్కజ్ తైబా, బహవల్పూర్లోని జైషే మహమ్మద్ (జెఎం)కి చెందిన మర్కజ్ సుభాన్ అల్లా, సియాల్కోట్లోని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన మెహమూనా జోయా ఫెసిలిటీ సహా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. డ్రోన్లు, క్షిపణులతో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెంది ఉంటారని భారత ఆర్మీ వెల్లడించింది.
అయితే, ఇండియన్ ఆర్మీ జరిపిన ఈ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదులకు అక్కడి పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు (Pak Officers) దగ్గరుండి అంత్యక్రియలు (Terrorists Funeral) నిర్వహించడం గమనార్హం. అంతేకాదు, ఉగ్రవాదుల మృతదేహాలపై ఆ పాక్ జాతీయ జెండాను ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఉగ్రవాదుల అంత్యక్రియల్లో తాము పాల్గొనలేదని పాక్ అధికారులు బుకాయించారు. దీంతో భారత్ వీరి బుకాయింపులకు చెక్ పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది. అంతేకాదు టెర్రరిస్టుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారులు పేర్లను కూడా భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, బ్రిగేడియర్ మొహమ్మద్ ఫుర్కాన్ షబ్బీర్, పాకిస్థాన్ సీనియర్ పోలీసు అధికారి ఉస్మాన్ అన్వర్ (ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్), మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్ (పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్) హాజరైనట్లు తెలిపింది. వీరంతా ఉగ్రవాదుల శవపేటికల ముందు ప్రార్థనలు చేస్తున్న ఫొటోలను కూడా విడుదల చేసింది. దీంతో ఉగ్రవాదులతో పాక్‌కు సంబంధాలు నిజమే అన్న అంశం మరోసారి బట్టబయలైనట్లైంది.
Also Read..
Operation Sindoor | ‘ఆపరేషన్ సిందూర్’లో హతమైన ఉగ్రవాదులు వీరే
DGMOs | మరికాసేపట్లో భారత్-పాక్ మధ్య చర్చలు.. ఇందులో పాల్గొనే ఇరుదేశాల డీజీఎంవోలు వీళ్లే..
Pulwama Attack | ‘పుల్వామా దాడి’ మా పనే.. ఎట్టకేలకు అంగీకరించిన పాకిస్థాన్