Operation Sindoor | న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 7న పాకిస్థాన్‌లో భారత సైన్యం జరిపిన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల్లో కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వీరిని నిషేధిత లష్కరే తాయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాదులుగా గుర్తించారు. లష్కరేకు చెందిన ముదాసర్ ఖాదియన్ ఖాస్ అలియాస్ ముదాసర్, అలియాస్ అబు జుందాల్, జేఈఎం వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ పెద్ద బావమరిది హఫీజ్ ముహమ్మద్ జమీల్, అదే సంస్థకు చెందిన మొహమ్మద్ యూసుఫ్ అజర్, మొహ్మద్ సలీం, ఘోసి సాహబ్ ఉన్నారు. లష్కరేకు చెందిన ఖాలిద్ అలియాస్ అకాషా, జేఈఎంకు చెందిన మహమ్మద్ హసన్‌ఖాన్ కూడా భారత దాడుల్లో హతమయ్యారు.
ముదాసర్ ఖాదియన్ ఖాస్
ముదాసర్ ఖాదియన్ మురిద్కేలోని మర్కజ్ తాయిబా ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్థాన్ ఆర్మీచీఫ్ అసీం మునీర్, పంజాబ్ ముఖ్యమంత్రి మర్యం నవాజ్ అతడి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్, పంజాబ్ ఐజీ హాజరయ్యారు.
హఫీజ్ ముహమ్మద్ జమీల్
మసూద్ అజర్ బావమరిది అయిన జమీల్ బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ అల్లా సంస్థకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నాడు.
మహమ్మద్ యూసఫ్ అజర్
జైషే మహమ్మద్‌కు చెందిన మరో ఉగ్రవాది. మసూద్ అజర్‌కు మరో బావమరిది ఇతడు. ఐసీ 814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడు.
ఖాలిద్ అలియాస్ అకాషా
లష్కరే తోయిబాకు చెందిన ఖాలిద్ కరుడుగట్టిన ఉగ్రవాది. జమ్ముకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు..అంత్యక్రియలకు పాకిస్థాన్ ఆర్మీ సీనియర్ అధికారులు హాజరయ్యారు.
మహమ్మద్ హసన్‌ఖాన్
జైషే కమాండర్ ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు.