హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల్ల బీఆర్ఎస్ పాలనలో ఉసేన్ బోల్ట్‌లా ఉరికిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నేడు కాంగ్రెస్ చేతిలో ఉసూరుమంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తప్ప మిగిలిన అన్ని రంగాలు కుదేలయ్యాయని విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది కాలంలో ఏడు వేల ఉద్యోగాలు ఎలా తగ్గాయని ప్రశ్నించారు. 2023-24లో 9.46 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారని, నిన్నటి గవర్నర్ ప్రసంగంలో అవి 9.39 లక్షలకు పడిపోయాయంటే 7 వేల ఉద్యోగాలు ఏ కారణంతో నిలదీశారు. 2023-24 నాటికి 80 శాతం సొంత పన్నుల ఆదాయం సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ నిలిచిందని చెప్పారు. 16 శాతం కంపౌడెంట్ యాన్యువల్ గ్రోత్ రేటుతో టాప్‌లో ఉన్నామని తెలిపారు. 2014-15 సొంత ఆదాయ వనరులు కేవలం రూ.29,288 కోట్లు ఉంటే 2023-24 నాటికి రూ.1,11,798 కోట్లకు చేరిందని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ర్టాన్ని ఇప్పుడు 6వ స్థానానికి పడేశారని మండిపడ్డారు. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.12 లక్షలు ఉంటే, తాము దిగిపోయేకాలానికి రూ.3.47 లక్షలతో దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలబెట్టామని చెప్పారు. కానీ, ఈ రోజు తలసరి ఆదాయం కూడా తగ్గిందని విమర్శించారు.
బీఆర్ఎస్ సర్కార్ ప్రపంచ స్థాయిలో ఔషధ నగరిని ఏర్పాటుచేయాలని చూసిందని, కానీ, కాంగ్రెస్ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత సిటీని పట్టించుకొనే నాథుడు లేడు కానీ, ఫ్యూచర్ సిటీపై పారిశ్రామికవేత్తలకు ఎట్లా నమ్మకం కుదురుతుందని ప్రశ్నించారు. డేరానగర్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చిన ముగ్గురు ప్రముఖులు పదేండ్ల తెలంగాణ ప్రగతిపై దిమ్మతిరిగే వాస్తవాలు చెప్పారని చురకలంటించారు.
తెలంగాణ అణువణువునా కేసీఆర్ ఆనవాళ్లున్నయి. వాటిని చెరిపేయడం కాంగ్రెస్ తరం కాదు. హిరణ్యకశిపుడు నారాయణ మంత్రాన్ని నిషేధిస్తే ఏ గతి పట్టిందో రేవంత్ సర్కార్‌కు అదే గతి పడుతది.
-కేటీఆర్ హెచ్చరిక
టీ హబ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యుబేటరని, దానిని చాయ్‌లు అమ్మే దుకాణంగా మార్చారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ కార్యాలయాలు అక్కడికి తరలించాలని ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత సవరించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ప్రగతి దెబ్బతిన్నదని, కానీ, రైజింగ్ పేరుతో ప్రభుత్వాన్ని జాకీలు పెట్టి లేపుతున్నారని ఎద్దేవాచేశారు. డేరానగర్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ర్టానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో?ఎన్ని ఎంవోయూలు చేసుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.