Pulwama Attack | న్యూఢిల్లీ: పాకిస్థాన్ తన ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందు మరోమారు బహిరంగా బయటపెట్టుకుంది. పుల్వామా దాడికి, తమకు సంబంధం లేదంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన దాయాది దేశం.. అది ఇప్పుడు తమ పనేనని స్వయంగా అంగీకరించింది. 2019లో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన బాంబుదాడిలో 40 మంది పారామిలటరీ సిబ్బంది మృతి చెందారు. ఇది పాక్ పనేనంటూ భారత్ అప్పట్లో సాక్ష్యాలు అందించినా తమకు సంబంధం లేదని బుకాయిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ మీడియా సమక్షంలో పుల్వామా దాడి తమ పనేనని అంగీకరించింది.
పాకిస్థాన్ వైమానికి దళానికి (పీఏఎఫ్) చెందిన పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పుల్వామాలో తమ వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించామని, తమ కార్యదీక్షత ఏపాటిదో ఇప్పటికే చూపించామని పేర్కొన్నారు. తమ గగనతలం, భూభాగం, జలాలకు కానీ, ప్రజలకు కానీ ముప్పు వాటిల్లితే రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఔరంగజేబు వ్యాఖ్యలు పుల్వామా దాడిలో పాక్ ప్రమేయాన్ని అంగీకరించడమే కాకుండా, పహల్గాం దాడి విషయంలో పాక్ వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి.