సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 21, 2020 , 01:01:38

కమల టికెట్‌ ఖరారు

కమల టికెట్‌ ఖరారు

  • డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీకి కమలాహారిస్‌ ఆమోదం 
  • తొలి ఇండో అమెరికన్‌ మహిళగా రికార్డు
  • జాతివివక్షకు వ్యాక్సిన్‌ లేదంటూ ట్రంప్‌పై ధ్వజం

వాషింగ్టన్‌, ఆగస్టు 20: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఉపాధ్యక్ష పదవికి ఓ ఇండియన్‌ అమెరికన్‌ మహిళ అభ్యర్థిత్వం ఖరారైంది. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా డెమోక్రటిక్‌ పార్టీ చేసిన ప్రతిపాదనను ఇండియన్‌ అమెరికన్‌ కమలాహారిస్‌ బుధవారం ఆమోదించారు. పార్టీ కన్వెన్షన్‌ మూడోరోజు ఆమె నామినేషన్‌ను పార్టీ ఖరారు చేసింది. దాంతో అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ఆఫ్రికన్‌, ఇండోఅమెరికన్‌ మూలాలున్న మహిళ దేశ రెండో అత్యున్నత పదవికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నవంబర్‌ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిప్‌పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్‌ గెలిస్తే కమలా హారిస్‌ మొదటి నల్లజాతి ఉపాధ్యక్షురాలుగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని ఇప్పటివరకు మహిళలు చేపట్టలేదు.

ట్రంప్‌ ఓ విఫల నేత

అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై కమలాహారిస్‌ విరుచుపడ్డారు. ‘మన విషాదాలను ట్రంప్‌ తన రాజకీయ అస్ర్తాలుగా మార్చుకుంటున్నారు. అధ్యక్షుడిగా ఆయన వైఫల్యాలతో మనం ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోయాం. ఆయన ఓ విఫల నాయకుడు’ అని అన్నారు. జాతివివక్ష అనే వ్యాధికి వ్యాక్సినే లేదని ట్రంప్‌పై  మండిపడ్డారు.  అమెరికా అధ్యక్షుడిగా ఉండేందుకు ట్రంప్‌ అనర్హుడని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా విమర్శించారు. 

కమలను ప్రతిపాదించిన చెల్లెలు, కోడలు, కూతురు

డెమోక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిత్వానికి కమలాహారిస్‌ పేరును ఆమె చెల్లెలు మాయా హారిస్‌, మేనకోడలు మీనాహారిస్‌, పెంపుడు కూతురు ఎల్లాఎమ్‌హాఫ్‌లు ప్రతిపాదించారు. పార్టీ ఆన్‌లైన్‌ కన్వెన్షన్‌లో కమల పేరును ప్రతిపాదిస్తూ వీరు ప్రసంగించారు.


logo