Bangladesh | పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు బంగ్లా ప్రత్యేక ట్రిబ్యునల్ మరణశిక్ష (Death Penalty) విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో బంగ్లాలో అల్లర్లు చెలరేగాయి. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హసీనా మద్దతుదారులు, అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారి ఆందోళనలతో బంగ్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అవామీలీగ్ పార్టీ రెండు రోజులపాటూ దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించింది. దీంతో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢాకా సహా ఇతర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు నిరసనకారులు ఢాకాలోని అనేక రహదారులను దిగ్బంధించారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. సౌండ్ గ్రెనేడ్లను, టియర్ గ్యాస్ (Tear gas)ను ప్రయోగించారు. తాజా అల్లర్లలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
కాగా, మానవత్వానికి వ్యతిరేకంగా క్రూర నేరాలకు పాల్పడ్డారనే కారణంతో బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాకు (Sheikh Hasina) మరణశిక్ష (Death Penalty) విధిస్తున్నట్లు ఆ దేశ ప్రత్యేక ట్రిబ్యునల్ సోమవారం తీర్పు ప్రకటించింది. షేక్ హసీనా పరోక్షంలో విచారణ జరిపిన ట్రిబ్యునల్ హసీనా ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన సదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా ఉరిశిక్ష విధించింది. కమల్ కూడా బంగ్లా నుంచి పరారై భారత్‌లో తలదాచుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఎగసిన నిరసనలకు వెరచి గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన హసీనా అప్పటి నుంచి భారత్‌లో నివసిస్తున్నారు. హసీనాను పరారీలో ఉన్న నేరస్థురాలిగా బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
Also Read..
షేక్ హసీనాకు మరణ శిక్ష.. తీర్పు మోసపూరితమన్న బంగ్లా మాజీ ప్రధాని
Sheikh Hasina | షేక్ హసీనాకు ఉరిశిక్ష.. తీర్పు సమయంలో న్యాయమూర్తుల సంచలన వ్యాఖ్యలు
Sheik Hasina | పెళ్లి రోజే మరణ శిక్ష.. ఉద్దేశపూర్వకంగానే తీర్పు తేదీని మార్చారా..?