శుక్రవారం 27 నవంబర్ 2020
International - Oct 24, 2020 , 01:16:21

భారత్‌లో గబ్బు గాలి: ట్రంప్‌

భారత్‌లో గబ్బు గాలి: ట్రంప్‌

  • మరోసారి నోరుపారేసుకున్న ట్రంప్‌
  • కాలుష్య కట్టడికి ఇండియా, చైనా, రష్యా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శ
  • ట్రంప్‌, బిడెన్‌ మధ్య ముగిసిన చివరి డిబేట్‌

వాషింగ్టన్‌, అక్టోబర్‌ 23: వాయుకాలుష్యం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. భారత్‌, రష్యా, చైనాల్లో గాలి నాణ్యత దారుణంగా ఉన్నదని, కాలుష్య కట్టడికి వారు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థుల మధ్య చివరి సంవాదం శుక్రవారం వాడీవేడిగా సాగింది. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ వివిధ అంశాలపై పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ..‘పారిస్‌ పర్యావరణ ఒప్పందం వల్ల అమెరికా లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చాం’ అని పేర్కొన్నారు. కాగా, భారత్‌పై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ‘హౌదీ మోదీ’ ఫలితం ఇదేనంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ ఎద్దేవా చేశారు. ప్రపంచంలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న 15 నగరాల్లో 10 మన దగ్గరే ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, తాము అధికారంలోకి వస్తే పారిస్‌ ఒప్పందంలో తిరిగి చేరుతామని బిడెన్‌ చెప్పారు.

సజావుగా సంవాదం..

సెప్టెంబర్‌ 23న జరిగిన తొలి డిబేట్‌ రసాభాసగా మారిన నేపథ్యంలో నిర్వాహకులు ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకరి ప్రసంగానికి మరొక అడ్డుపడకుండా మైక్‌ను మ్యూట్‌ చేశారు. దీంతో తిట్లు వంటి లేకుండా చివరి డిబేట్‌ సజావుగా ముగిసింది.  

 కరోనా వ్యాప్తి

కరోనా కట్టడికి తాము చేపట్టిన చర్యలపై వివిధ దేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని ట్రంప్‌ చెప్పగా, కరోనా నియంత్రణలో ట్రంప్‌ వైఫల్యం కారణంగానే దేశంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయని బిడెన్‌ విమర్శించారు.