The Lion Whisperer | ‘చూడప్పా సిద్దప్పా… నేను సింహం లాంటోణ్ని. కాకపోతే అది గడ్డం గీసుకోలేదు. నేను గీసుకోగలను. మిగతాదంతా సేమ్ టు సేమ్’ అంటాడు మన హీరో. ‘పులిని దూరం నుంచి చూడాలని పించిందనుకో చూస్కో… చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది…’ అంటాడు మరో టాలీవుడ్ తేజం. అవును మరి, పులులూ సింహాలతో పోల్చుకోవాలన్నా, వాటి గురించి మాట్లాడాలన్నా కూడా హీరో స్థాయి ఉండాల్సిందే. కానీ నిజంగానే సింహాలతో ఆటాడేసే అసలైన హీరోను చూడాలంటే మాత్రం దక్షిణాఫ్రికా దాకా వెళ్లాలి. సింహాలూ, చిరుతలూ, హైనాలతో కెవిన్ రిచర్డ్ చేసే దోస్తీ ప్రపంచ ప్రసిద్ధం మరి!
అడవికి రాజైన సింహం రాజసమే వేరు. దూరం నుంచి చూస్తేనే గుండె గుబేల్మనేంత గంభీరమైన రూపం, చూపు దాని సొంతం. ఇక, పెద్దపులి ఠీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందమైన నడకే అయినా ఎదురుగా ఉండి అడుగేసిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అలాంటిది, వాటిని ముద్దు చేసి లాలించి పాలించి ఆడించేవాడూ ఒకడున్నాడు. అది కూడా ఏ పసికూనల్నో కాదు, వేటలో రాటుదేలిన వన్యమృగాలను. అతనే దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ రిచర్డ్సన్ ( Kevin Richardson ).
యూట్యూబర్‌గా, వన్యప్రాణి సంరక్షకుడిగా, శాంక్చురీ యజమానిగా ఇతనికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. సింహాలు, హైనాలు, చిరుతల్లాంటి వాటితో ముచ్చటపెడుతూ, ఆటలాడుతూ ఇతను చేసే వీడియోలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ప్రధాన జంతువైన సింహాల పట్ల చూపే శ్రద్ధ కారణంగా ‘ద లయన్ విస్పరర్’గా ప్రసిద్ధి చెందాడు. తన యూట్యూబ్ ఛానెల్‌కు కూడా ఆ పేరునే పెట్టుకున్నాడు. ఈ ఛానెల్‌కి దాదాపు 20 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అందులో ఇతని వీడియోలకు ఉన్న వ్యూస్ అయితే కోట్లలోనే. ఇంతకూ విస్పరర్ అంటే తన హావభావాలు, మాటల ద్వారా జంతువులకు శిక్షణనిచ్చి పెంచేవాడని అర్థం.
రిచర్డ్సన్కు చిన్నప్పటి నుంచీ జంతువులంటే ప్రేమ. ఇరవై మూడేండ్ల వయసులో, ఒకసారి జూపార్కుకు వెళ్లినప్పుడు రెండు సింహం కూనలతో అనుబంధం ఏర్పడింది. అతను వాటిని ఆడించే తీరు చూసి జూ వాళ్లు వీలున్నప్పుడల్లా రమ్మన్నారు. అలా, నెమ్మదిగా పూర్తిస్థాయి ఉద్యోగిగా మారిపోయాడు. అందరిలా జంతువుల్ని గదమాయించకుండా, ప్రేమగా వ్యవహరించేవాడు. నెమ్మదిగా అవి కూడా ఇతణ్ని ప్రేమించడం ప్రారంభించాయి. అయితే ఈ కూనలు పెద్దయ్యాక.. వాటిని అక్రమంగా చంపుతున్నారని తెలుసుకొని, ఎంతో శ్రమకోర్చి సొంతంగా మరో పార్కుకు తరలించాడు. ఆ మృగాలను తాను సంరక్షిస్తున్న వీడియోలు తీస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
The Lion Whisperer6
నేషనల్ జియోగ్రఫీ చానెల్ సహా ప్రపంచ ప్రఖ్యాత టీవీలూ, పత్రికల ద్వారా గుర్తింపు సాధించాడు. తన పేరిట ఓ ఫౌండేషన్ కూడా స్థాపించాడు. దాదాపు మూడున్నర వేల ఎకరాల్లో శాంక్చురీ నడుపుతున్నాడు. కనీసం యాభై సింహాలను, లెక్కకు మిక్కిలి చిరుతలు, హైనాలను పెంచాడు. సింహాలతో ఫుట్‌బాల్ ఆడుతూ అతను పెట్టిన వీడియో భలే వైరల్ అయింది. ఆ దృశ్యాలను చూస్తే.. ఆ ప్రాణులు కెవిన్‌ను తమలో ఒకరిగానే భావిస్తున్నాయేమో అనిపిస్తుంది!
The Lion Whisperer7
“Flyrobe | ఫ్యాషన్ డబ్బున్నోళ్ల సొత్తు కాదు.. ఇదే ఈమె సక్సెస్ఫుల్ బిజినెస్ వెనుక ఉన్న నినాదం”