Pahalgam Terror Attack | ఉగ్రవాదానికి (Pahalgam Terror Attack) వ్యతిరేకంగా భారత్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ (Tammy Bruce) వెల్లడించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో టామీ బ్రూస్ మాట్లాడుతూ.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో జరిపిన సంభాషణను ప్రస్తావించారు. ‘భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మేము నిశితంగా గమనిస్తున్నాము. నిన్న మా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడారు. అధ్యక్షుడు ట్రంప్ గత వారం ప్రధాని మోదీతో మాట్లాడుతూ తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పక్షాన నిలుస్తామని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని ఆమె అన్నారు.
అదేవిధంగా ఇరుదేశాల ప్రభుత్వాలతో తాము టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. భారత్-పాక్‌లు బాధ్యతాయుతంగా సుదీర్ఘ శాంతి కోసం అవసరమైన పరిష్కారంపై పనిచేసేలా తమ కార్యదర్శి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అదే దక్షిణాసియాలో శాంతి నెలకొల్పుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రభుత్వాలతో బహుళ స్థాయిల్లో చర్చలు కొనసాగిస్తున్నట్లు టామీ బ్రూస్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఉద్రిక్తతలు తగ్గించుకోండి..
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా తమ సహకారం ఉంటుందని జైశంకర్ (S Jaishankar)కు రుబియో హామీఇచ్చారు. అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించుకొని, దక్షిణాసియాలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఇక పాక్ ప్రధానితో మాట్లాడిన రుబియో.. పెహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దాడిపై దర్యాప్తునకు పాక్ అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్‌తో ప్రత్యక్ష చర్చలు జరపాలని సూచించారు.
ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు పాక్ సహకరించాలి.. వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన ఫ్యామిలీతో భారత పర్యటనలో ఉన్న సమయంలోనే పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ దాడి గురించి ఆయన స్పందించారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌కు సూచించారు. పర్యాటకులపై దాడి దిగ్భ్రాంతికర విషయమన్నారు. ఈ దాడిపై భారత్ ప్రతిస్పందించడం సరైనదేనని వ్యాఖ్యానించారు. అయితే, విస్తృత ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయని విధంగా భారత్ స్పందన ఉంటుందని విశ్విస్తున్నట్లు చెప్పారు. ఇక పాకిస్థాన్ కూడా ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించాలని సూచించారు.
Also Read..
Cyber Attacks | పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌లో 10 లక్షల సైబర్ దాడులు
Air India | పాక్ ఆంక్షలు.. ఎయిర్ ఇండియాకు రూ.వేల కోట్ల నష్టం..!
JD Vance | ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించాలి.. పాక్‌కు జేడీ వాన్స్ సూచన