Air India | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. భారత్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)కు భారీ నష్టం వాటిల్లనుంది. ఏడాదికి ఏకంగా 600 మిలియన్ డాలర్లు (రూ.5 వేల కోట్లు) నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ మేరకు జాతీయ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.
గత నెల 22న పెహల్గామ్లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. దాయాది దేశంపై భారత్ పలు ఆంక్షలు విధించింది. అందుకు ప్రతిగా పాక్ సైతం ప్రతీకార చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భారత విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని మూసివేసింది. ఈ నిర్ణయంతో భారత్‌కు చెందిన విమానయాన సంస్థలపై పెను భారం పడనుంది. పాక్ చర్యతో భారత్‌లోని ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.
పాక్ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం కారణంగా విమానాలు వేరే మార్గాల గుండా ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా ప్రయాణ సమయం పెరిగింది. ముఖ్యంగా ఇంధనం ఖర్చు భారంగా మారింది. ఏడాది పాటూ ఇదే పరిస్థితి కొనసాగితే తమ సంస్థకు 591 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా అంచనా వేసింది. ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా సహా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు కూడా సూచనలు, సలహాలను పౌర వైమానిక శాఖకు తెలియజేశాయి. వీటిని పరిశీలించి తగిన పరిష్కారం వెతికే పనిలో ఆ శాఖ తలమునకలవుతోంది.
Also Read..
JD Vance | ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించాలి.. పాక్‌కు జేడీ వాన్స్ సూచన
Pak Army | సరిహద్దుల్లో ఉద్రిక్తత.. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు
CIA | భారత్ అంటే పాక్‌కు భయమే.. యుద్ధం చేసే దమ్ము ఆ దేశానికి లేదు: సీఐఏ