TRF | పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (The Resistance Front)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా (America) నిర్ణయంపై పాక్ తాజాగా స్పందించింది. టీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) వెల్లడించారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో ఇషాక్ దార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాక్ మంత్రి మాట్లాడుతూ.. ‘టీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థగా ప్రకటించే సార్వభౌమాధికారం అమెరికాకు ఉంది. యూఎస్ నిర్ణయంతో మాకు ఎలాంటి సమస్యా లేదు. వారి ప్రమేయం ఉందని ఆధారాలు ఉంటే అలా చేయొచ్చు. మేము స్వాగతిస్తాము’ అని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇషాక్ దార్ పేర్కొన్నారు. అయితే, టీఆర్ఎఫ్కు లష్కరే తోయిబాకు ముడిపెట్టడం మాత్రం తప్పని స్పష్టం చేశారు. ఆ సంస్థను తాము కొన్ని సంవత్సరాల క్రితమే కూల్చేశామన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసరాన్ వ్యాలీలో పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మారణహోమానికి తామే బాధ్యులమని ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’(TRF) ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత టీఆర్ఎఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
ఇదీ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చరిత్ర..
టీఆర్ఎఫ్.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (The Resistance Front). ఇది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇది ఆవిర్భవించింది. కశ్మీర్‌కు 2019 ఆగస్టులో ప్రత్యేక హోదా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పుట్టుకొచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా టీఆర్ఎఫ్ పనిచేస్తుంది. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాకి చెందిన ఉగ్రవాద కమాండర్లు ఈ సంస్థను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఎల్ఈటీకి అనుబంధంగా టీఆర్ఎఫ్ ఉగ్ర కార్యకలాపాలను కొనసాగిస్తున్నది.
సాజిద్ జాట్, సజ్జద్ గుల్, సలీమ్ రెహ్మని లాంటి వారు దీంట్లో నేతలుగా ఉన్నారు. వీళ్లంతా ఒకప్పుడు లష్కరే తీవ్రవాదులు. లష్కరేతో పాటు ఇతర ఉగ్ర గూపుల నుంచి దృష్టి మళ్లించేందుకు తాజా దాడుల్ని తాము చేస్తున్నట్లు టీఆర్ఎఫ్ చెప్పుకుంటోందని వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్‌మీడియా ద్వారా సైకలాజికల్ మైండ్ గేమ్ పోస్టులు, వీడియోలతో యువతను ప్రభావితం చేయడం టీఆర్ఎఫ్ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. అలా బ్రెయిన్ వాష్ అయిన యువతతో ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తూ.. ఉగ్ర దాడులకు స్కెచ్ వేయడం టీఆర్ఎఫ్ పని.
కశ్మీర్లో ఉగ్రదాడులతో పాటు కశ్మీరీ పండిట్ల హత్య కేసుల్లో టీఆర్ఎఫ్ హస్తం ఉంది. 2020 జనవరి నుంచి కశ్మీర్లో జరుగుతున్న దాడులకు తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ చెబుతోంది. 2024 అక్టోబర్‌లో గండేర్బాల్ జిల్లాలో, కుప్వారాలో 2020లో, 2023 అనంత్‌నాగ్ సహా పలుచోట్ల టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు మృతి చెందారు. అంతేకాదు కశ్మీర్ లోయలో జరుగుతున్న దాడుల వెనుక టీఆర్ఎఫ్ హస్తం ఉంది. మరోవైపు టీఆర్ఎఫ్ ఇప్పుడు యాక్టివ్ గ్రూపుగా మారినట్లు భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కూడా.
ఆన్లైన్ ద్వారా యువతను టీఆర్ఎఫ్ రిక్రూట్ చేసుకుంటున్నట్లు భారత ప్రభుత్వం ఆరోపించింది. పాక్ నుంచి ఆయుధాలు, నార్కోటిక్స్ సరఫరా కోసం ఆ యువతను వాడుకుంటున్నారు. ఉగ్రవాద సంస్థల వైపు జమ్ము కశ్మీర్ ప్రజల్ని ఆకర్షించేందుకు.. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎఫ్ సైకలాజికల్ ఆపరేషన్స్ చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కశ్మీర్ లోయలో టీఆర్ఎఫ్ వరుస ఊచకోతలకు పాల్పడుతుండటంతో.. 2023 జనవరిలో ఉగ్రసంస్థను కేంద్రం నిషేధించింది.
Also Read..
Bomb Threat | టెర్మినల్ 2 వద్ద బాంబు అమర్చాం.. ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వరుస బాంబు బెదిరింపులు
PM Modi | ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. అత్యంత విశ్వసనీయ నేతగా గుర్తింపు
IRCTC | రైళ్లలో ఆహార నాణ్యతపై 2024-25లో 6,645 ఫిర్యాదులు.. వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి