Shehbaz Sharif | పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ దాడుల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్మీ ఉన్నతాధికారులతో ఆ దేశ ప్రధాని (Pak PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాక్ రేంజర్లు భారత సరిహద్దు వెంబడి రెచ్చిపోతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు తెగబడుతున్నారు.
గత నెల 22న పెహల్గామ్లోని మినీస్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాయాది దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన 15 రోజులకు భారత్ ప్రతీకార చర్యకు దిగింది.
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ విరుచుకుపడింది. పాక్ ఆర్మీ, పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. జైషే మహమ్మద్, మురిద్కే లష్కరే తోయిబా క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.
Also Read..
Jaish-e chief | ఆపరేషన్ సిందూర్.. జైషే చీఫ్ మసూద్ కుటుంబం హతం
Operation Sindoor | ధర్మో రక్షతి రక్షితః.. ఆపరేషన్ సిందూర్‌పై క్రికెటర్ల స్పందన
PM Modi | ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన రద్దు