Bangladesh Crisis | ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) అట్టుడుకుతోంది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. రాజధాని ఢాకా (Dhaka) సహా అనేక నగరాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఆ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 440కి చేరింది.
ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తన పదవికి సోమవారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. అనంతరం ఢాకాలోని ప్యాలెస్‌ను వీడి ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లా మీదుగా భారత్ చేరుకున్నారు. ఇక హసీనా రాజీనామా అనంతరం దేశంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ హింసలో సుమారు 100 మందికిపైగా మరణించారని స్థానిక మీడియా నివేదించింది.
హసీనా రాజీనామా చేసి దేశం వీడారన్న వార్త తెలియగానే వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. రాజధాని ఢాకాలోని పీఎం అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి.. అక్కడి వస్తువులు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. చేతికందినకాటికి దోచుకెళ్లారు. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వంలోని మంత్రులు, పార్టీ ఎంపీల నివాసాలు, వ్యాపార సంస్థలపై కూడా నిరసన కారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 109 మంది మరణించారని స్థానిక మీడియా పేర్కొంది.
దేశవ్యాప్తంగా జులై 16 నుంచి నిన్నటి వరకూ 21 రోజుల్లో జరిగిన అల్లర్లలో మొత్తం మరణాల సంఖ్య 440కి చేరినట్లు వెల్లడించింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య దాదాపు 37 మృతదేహాలను ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘర్షణల్లో బుల్లెట్ సహా వివిధ గాయాలతో సుమారు 500 మంది ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపింది. మరోవైపు దేశంలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ రంగంలోకి దిగింది. దేశంలో పరిస్థితుల్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read..
Bangladesh | బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు.. త్వరలో సైన్యం నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటు