Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు వరదలు సంభవించాయి. రుతుపవనాల (Monsoon) ప్రభావంతో నెల రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు 200 మందికిపైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వర్ష బీభత్సానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది.
పాక్ విపత్తు నిర్వహణ సంస్థ (Pakistan National Disaster Management Authority) పంచుకున్న డేటా ప్రకారం.. జూన్ 26 నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 266 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 126 మంది పిల్లలు ఉన్నారు. పంజాబ్‌లో అత్యధికంగా 144 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఖైబర్ పఖ్తుంఖ్వాలో 63 మంది, సింధ్‌లో 25 మంది, బలూచిస్థాన్‌లో 16 మంది, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 10 మంది, ఇస్లామాబాద్‌లో ఎనిమిది మంది మరణించారు. ఇక ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో దేశ వ్యాప్తంగా 628 మంది గాయపడ్డారు. అందులో పంజాబ్‌లో 488, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 69, సింధ్‌లో 40, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 18, బలూచిస్థాన్‌లో నలుగురు, ఇస్లామాబాద్‌లో ముగ్గురు గాయపడ్డారు.
ఈ భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గత 24 గంటల్లో 246 ఇళ్లు దెబ్బతిన్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి 1,250కిపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 366 పశువులు మృత్యువాతపడ్డాయి. పంజాబ్‌లో గవర్నర్ సర్దార్ సలీం హైదర్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. పలు ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాదకరస్థాయికి మించి పెరిగింది. మరోవైపు హరిపూర్‌లోని ఖాన్పూర్ తహసీల్‌లో కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి.
Also Read..
PM Modi | ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. మూడేళ్లలో రూ.295 కోట్ల ఖర్చు
OTT platforms | అశ్లీల చిత్రాలు.. 24 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నిషేధించిన కేంద్రం
Indian Embassy | థాయ్‌లాండ్, కాంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక అడ్వైజరీ