Looting | ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) రగిలిపోతోంది. వలసల పట్ల అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా వేలాదిగా జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. అయితే, నిరసన ముసుగులు పలువురు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
అదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. స్థానికంగా ఉన్న ఖరీదైన దుకాణాలను దోచుకుంటున్నారు. యాపిల్ (Apple) స్టోర్, బంగారం దుకాణాలు సహా పలు వాణిజ్య కేంద్రాలను లూటీ (Looting) చేస్తున్నారు. ముసుగులు ధరించిన కొందరు డౌన్‌టౌన్‌లోని యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించి అక్కడున్న ఖరీదైన ఫోన్లను దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Apple store in downtown LA being looted tonight pic.twitter.com/3k5i7wKiSG
— Brendan Gutenschwager (@BGOnTheScene) June 10, 2025
డౌన్టౌన్లో కర్ఫ్యూ..
మరోవైపు ఈ నిరసనల నేపథ్యంలో లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డౌన్‌టౌన్ (Downtown)లోని పలు ప్రాంతాల్లో పరిమిత కర్ఫ్యూ (Curfew) విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. అయితే, ఈ కర్ఫ్యూ నివాసితులకు, ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులకు వర్తించదని పేర్కొన్నారు.
అక్రమ వలసదారుల అరెస్ట్‌కు నిరసనగా గత వారాంతంలో లాస్ ఏంజిలిస్‌లో చెలరేగిన నిరసనలు అమెరికాలోని ఇతర నగరాలకు పాకాయి. అట్లాంటాలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ-ఐస్) కార్యాలయం ముందు పలువురు ఆందోళనకు దిగారు. అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆస్టిన్, న్యూయార్క్, షికాగో, సియాటెల్, డాలస్, కెంటకీ తదితర నగరాల్లో నిరసనకారులు ఐస్ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. మరోవైపు లాస్ ఏంజెలెస్‌లో జరుగుతున్న నిరసనలను అణచేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4 వేల మంది నేషనల్ గార్డ్ దళాలను, 700 మంది మెరైన్స్ను మోహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
నిరసనలెందుకంటే?
ఈ నెల 6న ఐస్ ఏజెంట్లు లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారుల ఏరివేత కోసం దాడులు నిర్వహించడంతో వారికి మద్దతుగా వలసదారుల నిరసనలు ప్రారంభమయ్యాయి. తర్వాతి రోజు పలు హోమ్ డిపార్ట్మెంట్ స్టోర్లలో ఐస్ సోదాలు జరిపింది. లాటిన్ దేశాల వలసదారుల కోసం ఐస్ ఏజెంట్లు సోదాలు చేశారని నిరసనకారులు ఆరోపించారు. సాయంత్రానికల్లా వందలాది మంది నిరసనకారులు ఫెడరల్ భవనం బయట గుమికూడి ర్యాలీ నిర్వహించారు. కాలిఫోర్నియా సర్వీస్ ఎంప్లాయిస్ ఇంటర్నేషనల్ యూనియన్ అధ్యక్షుడితో సహా వంద మందినిపైగా పోలీసులు అరెస్ట్ చేయడంతో జూన్ 7 నుంచి నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. లాస్ఏంజెలెస్లోని డౌన్‌టౌన్ నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది. దీంతో తాజాగా అక్కడ పరిమిత కర్ఫ్యూ విధిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
Also Read..
Los Angeles | లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న నిరసనలు.. కర్ఫ్యూ విధింపు
Shubhanshu Shukla | రాకెట్లో సాంకేతిక సమస్యతో శుభాన్షు శుక్లా రోదసి యాత్ర వాయిదా
Los Angeles | లాస్ ఏంజిలిస్ టు షికాగో.. యాంటీ ఐస్ నిరసనలు తీవ్రం