లాస్ ఏంజిలిస్: అక్రమ వలసదారుల అరెస్ట్‌కు నిరసనగా గత వారాంతంలో లాస్ ఏంజిలిస్‌లో చెలరేగిన నిరసనలు సోమవారం అమెరికాలోని ఇతర నగరాలకు పాకాయి. అట్లాంటాలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ-ఐస్) కార్యాలయం ముందు పలువురు ఆందోళనకు దిగారు. అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆస్టిన్, న్యూయార్క్, షికాగో, సియాటెల్, డాలస్, కెంటకీ తదితర నగరాల్లో నిరసనకారులు ఐస్ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. మరోవైపు లాస్ ఏంజిలిస్‌లో జరుగుతున్న నిరసనలను అణచేసేందుకు అదనంగా మరో 2 వేల మంది నేషనల్ గార్డ్లను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులను ఆదేశించారు. అమెరికా సైన్యం తాత్కాలికంగా 700 మెరైన్లను నగరానికి పంపింది.
అక్రమ వలసదారుల కోసం నగరంలో సోదాలు ముమ్మరంగా జరుగుతుండటంతో నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. దీంతో స్థానిక నివాసితులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బలగాల మోహరింపు చర్యను ట్రంప్ సమర్థించుకుంటూ.. తాను నేషనల్ గార్డులను పంపకపోతే లాస్ ఏంజిలిస్ నగరం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయేదన్నారు. మిలిటరీ మోహరింపుపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా మరోసారి మండిపడ్డారు. ‘ఇది ప్రజల భద్రత కోసం కాదు. ఇది ఒక ప్రమాదరకమైన అధ్యక్షుడి అహాన్ని దెబ్బ తీయడం గురించి. ట్రంప్ చర్య నిర్లక్ష్యంగా, అర్థ రహితంగా, మన సైన్యాన్ని అగౌరవ పరిచేలా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
నిరసనలెందుకంటే?
ఈ నెల 6న ఐస్ ఏజెంట్లు లాస్ ఏంజిలిస్‌లో అక్రమ వలసదారుల ఏరివేత కోసం దాడులు నిర్వహించడంతో వారికి మద్దతుగా వలసదారుల నిరసనలు ప్రారంభమయ్యాయి. తర్వాతి రోజు పలు హోమ్ డిపార్ట్మెంట్ స్టోర్లలో ఐస్ సోదాలు జరిపింది. లాటిన్ దేశాల వలసదారుల కోసం ఐస్ ఏజెంట్లు సోదాలు చేశారని నిరసనకారులు ఆరోపించారు. సాయంత్రానికల్లా వందలాది మంది నిరసనకారులు ఫెడరల్ భవనం బయట గుమికూడి ర్యాలీ నిర్వహించారు. కాలిఫోర్నియా సర్వీస్ ఎంప్లాయిస్ ఇంటర్నేషనల్ యూనియన్ అధ్యక్షుడితో సహా వంద మందినిపైగా పోలీసులు అరెస్ట్ చేయడంతో జూన్ 7 నుంచి నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. లాస్ఏంజిలిస్లోని డౌన్‌టౌన్ నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది.