Kamala Harris | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)పై మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన అహంకారమే గత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణమని ఆరోపించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మళ్లీ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం అత్యంత బాధ్యతారహితమైనదని వ్యాఖ్యానించారు. తన ఆత్మకథ ‘107 డేస్’లో ఆమె ఈ విషయాలను రాసుకున్నారు.
2024 జులైలో జరిగిన డిబేట్లో పేలవమైన ప్రదర్శన తర్వాత బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలోకి దిగారు. అయితే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటి పరిస్థితులను కమలా తన ఆత్మకథలో రాసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జో బైడెన్, జిల్ బైడెన్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని ఒక మంత్రంలా పాటించామని, అది అవివేకమని చెప్పారు. పార్టీలో తీవ్ర చర్చ జరిగిన తర్వాతే బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారని, ఆ తర్వాతే తన పేరును ప్రతిపాదించారని హారిస్ తెలిపారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి బైడెన్ అహంకారం (Ego), లెక్కలేనితనమే (Recklessness) కారణమని ఆరోపించారు.
పోటీ నుంచి తప్పుకోమని బైడెన్‌కు సలహా ఇచ్చే పరిస్థితుల్లో అప్పుడు తాను లేనని కమలా తెలిపారు. ఒకవేళ తాను ఆ సలహా ఇచ్చి ఉంటే అది తన స్వార్థం కోసమే అని, అధికార దాహంతోనే అలా చెప్పానని ఆయన భావించేవారని చెప్పుకొచ్చారు. ఉపాధ్యక్షురాలిగా ఉన్నంత కాలం వైట్ హౌస్‌తో తన సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవని తెలిపారు. బైడెన్ స్టాఫ్ తనను పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. తన ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని కమలా హారిస్ ఆరోపించారు. కమలా వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Also Read..
Charlie Kirk | భారతీయులకు మరిన్ని వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. చార్లీ కిర్క్ పోస్ట్ వైరల్
Charlie Kirk: క్యాంపస్ బిల్డింగ్ రూఫ్ నుంచి షూట్ చేశాడు.. ఆ షూటర్ కోసం కొనసాగుతున్న గాలింపు
భారత్‌పై 100% సుంకాలు విధించండి.. ఈయూను కోరిన ట్రంప్