Jaish-e chief | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ విజయవంతంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) దాయాది దేశం పాక్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఈ దాడులతో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ (Jaish-e chief) మౌలానా మసూద్ అజార్ (Masood Azhar)కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఇప్పటికే అజార్ కుటుంబం మొత్తం హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరుడు, ప్రస్తుతం జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ (Abdul Rauf Asghar) ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిసింది. భారత్ చేపట్టిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడినట్లు నిఘా వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన పాక్ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వాటిలోని అనేక మంది ముష్కరులను తుదముట్టించింది.
భారత్ దాడుల్లో బహవల్పూర్ (Bahawalpur)లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం (Jaish terror camp) పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో 10 మంది మసూద్ కుటుంబ సభ్యులు, నలుగురు సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. జైషే చీఫ్ ప్రాణాలతోనే ఉన్నట్లు తెలిసింది. భారత్ జరిపిన దాడిలో తన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయినట్లు మసూదే స్వయంగా వెల్లడించారు. ఇక మరణించిన వారిలో మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్ పాక్‌లోనే 12వ అతిపెద్ద నగరం. ఇక్కడ జైషే ప్రధాన కార్యాలయం 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవంతిని ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. పుల్వామా దాడి సహా భారత్‌పై చాలా కుట్రలకు ఇక్కడే పథక రచన చేశారు. ఈ భవనాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ఇందులోనే ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Jaish-e chief | ఆపరేషన్ సిందూర్.. జైషే చీఫ్ మసూద్ కుటుంబం హతం
India-Pak | పాక్‌కు గట్టి షాక్.. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసిన భారత్
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌తో నేలమట్టమైన ఉగ్రస్థావరాలు.. ఉపగ్రహ చిత్రాలు
Jaish-e headquarters | భారత్ దాడుల్లో ధ్వంసమైన జైషే ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయం.. VIDEO