Wildfires | హమాస్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ (Israel)లో కార్చిచ్చు (Wildfires) బీభత్సం సృష్టిస్తోంది. జెరూసలెం (Jerusalem) శివారులోని అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ఈ కార్చిచ్చుతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతంలోని వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకూ 14 మంది గాయపడినట్లు స్థానిక మీడియా నివేదించింది. అయితే, ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
కార్చిచ్చు కారణంగా జెరూసలెం నుంచి టెల్ అవీవ్ (Tel Aviv)ను కలిపే ప్రధాన రోడ్డు సహా అన్ని రహదారులను అధికారులు మూసివేశారు. ఆ రహదారి వెంట పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు తమ కార్లను వదిలి ప్రాణ భయంతో పరుగులుతీస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం.. దాదాపు 160కి పైగా రెస్క్యూ, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి. విమానాలు, హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
వీరికి తోడు ఆ దేశ సైన్యం కూడా రంగంలోకి దిగింది. అయితే, పొడి వాతావరణ పరిస్థితులు, బలమైన గాలులకు ఈ మంటలు వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఇది ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. కార్చిచ్చు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. మంటలు జెరూసలెం వరకూ వ్యాపించవచ్చని హెచ్చరించారు. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి అని అన్నారు.
Also Read..
Pahalgam Attack | ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. భారత్, పాక్‌కు అమెరికా సూచన
Chinmoy Das | బంగ్లాదేశ్‌లో అరెస్టైన హిందూ సన్యాసి చిన్మయ్ దాస్‌కు.. ఆరు నెలల తర్వాత బెయిల్