Israel | ఏడాది కాలంగా ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం (Israel – Hamas War) కొనసాగుతోంది. ఇక ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ మానవవనరుల కొరతను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో కార్మికుల కొరత (construction workers) తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో నైపుణ్యాల కొరతను పరిష్కరించేందుకు విదేశాల నుంచి కార్మికులను రప్పిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో నియామకాలు చేసుకుంటోంది.
ఇప్పటికే ఒకసారి కార్మికులను నియమించుకున్న ఇజ్రాయెల్.. మరోసారి వేల సంఖ్యలో కార్మికులను నియమించుకునేందుకు భారత్‌ను సంప్రదించినట్లు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (National Skill Development Corporation) వెల్లడించింది. 10 వేల నిర్మాణ కార్మికులు, ఐదు వేల ఆరోగ్య సంరక్షకుల కోసం నియామకాలు చేపట్టనున్నట్లు ఎన్ఎస్డీసీ తెలిపింది. ఫ్రేమ్ వర్క్, ఐరన్ బెండింగ్, ప్లాస్టరింగ్, సిరామిక్ టైలింగ్ విభాగాల్లో ఉద్యోగుల్ని ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్కిల్ టెస్ట్ నిర్వహించేందుకు మరికొన్ని వారాల్లోనే పీఐబీఏ బృందం భారత్‌కు రానున్నట్లు ఎన్డీఎస్సీ తెలిపింది.
యుద్ధం నేపథ్యంలో నిపుణులైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ తొలి దఫాలో 10 వేల మందికిపైగా నిర్మాణ కార్మికులను నియమించుకున్న విషయం తెలిసిందే. యూపీ, హర్యానా, తెలంగాణ రాష్ట్రాల నుంచి 10,349 మందిని నియమించుకుంది. ఈ సారి మహారాష్ట్రలో నియామకాలు చేపట్టనుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1.92 లక్షల జీతంతోపాటు బీమా, ఆహారం, వసతి కల్పించనున్నారు. దీంతో పాటు రూ.16,515 బోనస్ కూడా ఇస్తారు. నిర్మాణ రంగంతో పాటు వైద్య రంగంలో 5 వేల మంది సంరక్షకులను నియమించుకోనుంది. 10వ తరగతి ఉత్తీర్ణత, కేర్‌గివింగ్ కోర్సు పూర్తి చేసి కనీసం 990 గంటల పాటు సంబంధిత విభాగంలో శిక్షణ పొందిన వారు ఈ ఉద్యోగానికి అర్హులని ఎన్ఎస్డీసీ వెల్లడించింది.
తాత్కాలిక ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇజ్రాయెల్ – భారత్‌లు 2023లో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం నేపథ్యంలో ఈ ఏడాది ఆరంభంలో పలువురు కార్మికులను ఇజ్రాయెల్ నియమించుకుంది. తొలి రిక్రూట్మెంట్ రౌండ్లో 16,832 మంది అభ్యర్థులు నైపుణ్య పరీక్షలకు హాజరయ్యారు. అందులో 10,349 మంది ఎంపికయ్యారు. వీరికి కూడా రూ.1.92 లక్షల నెలవారీ జీతంతోపాటు రూ.16,515 నెలవారీ బోనస్, వైద్య బీమా, ఆహారం, వసతి వంటి అదనపు ప్రయోజనాలు పొందుతున్నారు.
Also Read..
Vietnam | వియత్నాంలో యాగి విధ్వంసం.. 141కి పెరిగిన మృతుల సంఖ్య
Donald Trump | ఇదే బెస్ట్ డిబేట్.. కమలా హారిస్‌తో చర్చపై ట్రంప్ స్పందన
KTR | అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు.. కమలా హారిస్‌పై కేటీఆర్ ట్వీట్