Vietnam | వియత్నాం (Vietnam)లో యాగి తుపాను (Typhoon Yagi) విధ్వంసం సృష్టించింది. ఈ తుపాను ధాటికి ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆకస్మిక వరదలు (Flash flood) సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. యాగి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ తుపాను కారణంగా సంభవించిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 141కి పెరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. సుమారు 69 మంది గల్లంతయ్యారని.. వారి జాడ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ తుపాను బీభత్సానికి ఉత్తర వియత్నాంలోని లావో కై ప్రావిన్స్‌లో గల లాంగ్ నౌ అనే గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న 35 కుటుంబాలు మట్టి చరియలు, శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఇప్పటి వరకు 16 మృతదేహాలను సహాయ బృందాలు వెలికితీయగా.. 40 మంది గల్లంతయ్యారు. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు.
టైఫూన్ యాగి.. ఈ ఏడాది ఆసియాను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్‌గా రికార్డుకెక్కింది. శనివారం ఆ తుఫాన్ వియత్నంలోకి ఎంటర్ అయ్యింది. ఆ సమయంలో సుమారు 203 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇంటి పైకప్పులు ఎగిరి నేలపై పడ్డాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షల మంది ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దాదాపు అన్ని నదులూ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
వరద ఉద్ధృతికి ఉత్తర వియత్నాంలో ఉన్న ఓ బిజీ బ్రిడ్జ్ కూలిపోయింది. ఉత్తర ప్రావిన్స్ ఫూ తూ (Phu Tho) లోని ఎరుపు నదిపై (Red River) ఉన్న 30 ఏళ్ల నాటి వంతెన ఒక్కసారిగా కూలిపోయింది (bridge collapse). ఆ సమయంలో బ్రిడ్జ్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో పది మందికిపైగా గల్లంతైనట్లు వియత్నాం మీడియా నివేదించింది.
Also Read..
Donald Trump | ఇదే బెస్ట్ డిబేట్.. కమలా హారిస్‌తో చర్చపై ట్రంప్ స్పందన
KTR | అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు.. కమలా హారిస్‌పై కేటీఆర్ ట్వీట్
Haider Raza: 2.5 కోట్లు ఖరీదు చేసే హైదర్ రాజా పెయింటింగ్ చోరీ