Israel : రఫా (Rafah) లోని ‘గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్’ కేంద్రం వద్ద ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనకు ఇజ్రాయెల్ సైనిక దళాలే (IDF) కారణమన్న ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం (Israel army) తిరస్కరించింది. ఈ ఘటన వెనుక హమాస్ (Hamas) హస్తం ఉందని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ డ్రోన్ వీడియో (Drone video) ను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది.
‘ఆహారం తీసుకోవడానికి వెళుతున్న ప్రజలపై ఓ గన్మెన్ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు డ్రోన్ చిత్రీకరించిన వీడియోలో ఉన్నాయి. అక్కడి ప్రజలు ఆహారం తీసుకోకుండా అడ్డుకోవడానికి హమాస్ తన చేతిలో ఉన్న శక్తినంతా ప్రయోగించింది.’ అని ఐడీఎఫ్ ట్విటర్లో ఆరోపించింది. ఈ దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం నిందించుకుంటున్నాయి. మృతులను తల, ఛాతీపై కాల్చి చంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా ఆహారం కోసం, అత్యవసర సరుకుల కోసం వచ్చిన పాలస్తీనియన్లపై ఆదివారం ఉదయం కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ మద్దతున్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) పంపిణీ కేంద్రం దగ్గర ఈ దాడి జరిగిందని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. వేల సంఖ్యలో వస్తున్న జనంపై అన్నివైపుల నుంచి కాల్పులు జరిగినట్లు స్థానికులు తెలిపారు. సైన్యం కాల్పులు జరిపిందన్న విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఐడీఎఫ్ వెల్లడించింది.