Piyush Goyal : ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటనపై భారత్‌కు, అమెరికాకు (India-US) మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) చెప్పారు. ఈ ఒప్పందం విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చల్లో పాల్గొన్న సమయంలోనూ మాట్లాడుకున్నారని తెలిపారు.
వాణిజ్యం విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలనే భావనతో ఉన్నాయని గోయల్ చెప్పారు. ఈ సమస్యను ఇరుదేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటాయన్నారు. ఇరుదేశాల మధ్య ప్రతిపాదిత, మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్‌ను సందర్శించనుందని తెలిపారు. జూన్ చివరికి ఇరుదేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరే అవకాశం ఉందన్నారు.
ఈ విషయంపై భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గత నెలలో వాషింగ్టన్లో అధికారులతో చర్చలు జరిపారని గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో అధికారిక పర్యటనలో ఉన్న గోయల్ ఆ దేశంతో వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంచుకోవడానికి అక్కడి నాయకులు, వ్యాపార ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియంపై ఉన్న 25 శాతం సుంకాలను జూన్ 4 నుంచి రెట్టింపు చేస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు.
అయితే దీనివల్ల భారతీయ ఆటో మొబైల్-భాగాల ఉత్పత్తుల ఎగుమతిదారులపై, ఉక్కు పరిశ్రమల రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరించారు. దాంతో అగ్రరాజ్యానికి చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నామన్న విషయాన్ని భారత్ ప్రపంచ వ్యాణిజ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లింది. భారత స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ వ్యాణిజ్య సంస్థ యూఎస్‌కు నోటీసులు పంపగా వాటిని అగ్రరాజ్యం తిరస్కరించింది.