Supreme Court : అస్సాం (Assam) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ వేశాడు. తన తల్లిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆమె ఎక్కడుందో తెలియడం లేదని, ఆమెను కోర్టులో హాజరుపర్చాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. ఈ క్రమంలో ఆ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.
వివరాల్లోకి వెళ్తే.. మనోవర బెవా అనే మహిళ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పరిగణిస్తూ 2016లో అస్సాం ప్రభుత్వం ఆమెను అదుపులోకి తీసుకుంది. మూడేళ్లపాటు నిర్బంధ శిబిరంలో ఉంచింది. 2019లో ఆమెకు నిర్బంధం నుంచి విముక్తి కలిగింది. నాడు మనోవరకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాటి నుంచి వాటిని పాటిస్తూ అస్సాంలో ఉంటున్న ఆమెను ఇటీవల పోలీసులు మళ్లీ నిర్బంధించారు.
అయితే తన తల్లి గురించి ఏ సమాచారం లేదని ఆందోళనకు గురైన ఆమె కుమారుడు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నిర్బంధ శిబిరం నుంచి విడుదలయ్యాక సుప్రీంకోర్టు ఇచ్చిన షరతులను పాటిస్తూ తన తల్లి జీవిస్తోందని, కానీ ఇటీవల స్టేట్మెంట్ నమోదు చేయాలంటూ తన తల్లిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారని, అక్కడికి వెళ్లిన అమ్మ మళ్లీ తిరిగి రాలేదని పిటిషన్లో పేర్కొన్నాడు.
అమ్మ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఆమెను కలుసుకోలేకపోయానని, ఆమెకు సంబంధించిన కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే ఉందని పోలీసులకు చెప్పేందుకు ప్రయత్నించానని, అయినప్పటికీ ఆమెను విడుదల చేసేందుకు వారు నిరాకరించారని ఆ యువకుడు కోర్టుకు తెలియజేశాడు. ఇప్పుడు తన తల్లి ఎక్కడుందో తెలియడం లేదని, తనని కోర్టులో హాజరుపర్చాలని కోరుతున్నానని బాధితుడు పిటిషన్లో పేర్కొన్నాడు.