e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home News మ‌నిషి 150 ఏళ్లు బ‌తుకుతాడా.. తాజా అధ్య‌య‌నం ఏం చెబుతోంది?

మ‌నిషి 150 ఏళ్లు బ‌తుకుతాడా.. తాజా అధ్య‌య‌నం ఏం చెబుతోంది?

మ‌నిషి 150 ఏళ్లు బ‌తుకుతాడా.. తాజా అధ్య‌య‌నం ఏం చెబుతోంది?

బ్రైట‌న్‌: శ‌త‌మానం భ‌వ‌తి అని పెద్ద‌లు దీవిస్తుంటారు. అంటే వందేళ్లు ఆయురారోగ్యాల‌తో జీవించమ‌ని అర్థం. ఎవ‌రైనా చిన్న వ‌య‌సులోనే చ‌నిపోతే అప్పుడే నిండు నూరేళ్లూ నిండిపోయాయా అంటుంటాం. ఎలా చూసినా ఓ మ‌నిషి వందేళ్లు బ‌తుకుతాడ‌ని మ‌నం త‌ర‌చూ చెప్ప‌క‌నే చెబుతుంటాం. కానీ ప్ర‌పంచంలో వందేళ్ల కంటే ఎక్కువ కాలం బ‌తికిన వాళ్లు కూడా ఉన్నారు. రికార్డుల ప్ర‌కారం ఫ్రాన్స్‌కు చెందిన జీన్ కాల్‌మెంట్ అనే మ‌హిళ గ‌రిష్ఠంగా 122 ఏళ్లు బ‌తికింది. మ‌రి నిజంగా ఓ మ‌నిషి ఎంత కాలం బ‌త‌క‌గ‌ల‌డు అన్న ప్ర‌శ్న‌కు శ‌తాబ్దాలుగా స్ప‌ష్ట‌మైన స‌మాధానం లేదు.

150 ఏళ్లు బ‌తుకుతారా?
గ‌తంలో జ‌రిగిన కొన్ని అధ్య‌య‌నాలు మ‌నుషులు 140 ఏళ్ల వ‌ర‌కూ కూడా బ‌త‌క‌వ‌చ్చ‌ని తేల్చాయి. కానీ తాజా అధ్య‌య‌నం ఒక‌టి మాత్రం మ‌నుషులు 150 ఏళ్లు కూడా బ‌త‌క‌గ‌ల‌ర‌ని స్ప‌ష్టం చేస్తోంది. నిజానికి 19వ శ‌తాబ్దం నుంచి ఓ మనిషి జీవితకాలాన్ని అంచ‌నా వేయ‌డానికి గోంపెర్ట్జ్ ఈక్వేష‌న్‌ను ఉప‌యోగిస్తున్నారు. దీని ప్ర‌కారం ఓ మ‌నిషి మ‌ర‌ణించే అవ‌కాశాలు కాలాన్ని బ‌ట్టి పెరుగుతుంటాయి. అంటే ఓ వ్య‌క్తి జీవించే ప్ర‌తి 8 లేదా 9 ఏళ్ల‌కు ఆ వ్య‌క్తి మ‌ర‌ణించే రేటు రెట్టింపు అవుతుంది. దీనికి క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బులు, ఇన్ఫెక్ష‌న్లు త‌దిత‌రాలు కార‌ణం కావ‌చ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ గోంపెర్ట్జ్ ఈక్వేష‌న్‌నే ఉప‌యోగిస్తాయి. అందుకే ఇన్సూరెన్స్ చేసే ముందు మీ మెడిక‌ల్ హిస్ట‌రీ మొత్తం అడ‌గ‌టం గ‌మ‌నించే ఉంటారు.

అవ‌య‌వాలు ఎంత కాలం ప‌ని చేస్తాయ‌న్న దాన్ని బ‌ట్టి కూడా మ‌నిషి జీవించే కాలాన్ని అంచ‌నా వేసే మ‌రో ప‌ద్ధ‌తి కూడా ఉంది. వ‌య‌సుతో పాటు అవ‌య‌వాల ప‌నితీరు మంద‌గించి, చివ‌రికి అవి ప‌ని చేయ‌కుండా పోయిన‌ప్పుడు మ‌ర‌ణం సంభ‌వించ‌డం. ఆ లెక్క‌న అవ‌య‌వాలు గ‌రిష్ఠంగా 120 ఏళ్లు మాత్ర‌మే ప‌ని చేస్తాయ‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన అధ్య‌య‌నాల్లో తేల్చేశారు.

తాజా అధ్య‌య‌నం ఏంటి?
కానీ తాజా అధ్య‌యనంలో మాత్రం సింగ‌పూర్‌, ర‌ష్యా, అమెరికాల్లోని ప‌రిశోధ‌కులు ఓ మ‌నిషి జీవిత‌కాలాన్ని అంచ‌నా వేయ‌డానికి విభిన్న‌మైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఓ కంప్యూట‌ర్ మోడ‌ల్ ఉప‌యోగించి మ‌నిషి జీవిత కాలం గ‌రిష్ఠంగా 150 ఏళ్లు కూడా ఉండొచ్చని ఓ అంచ‌నాకు వ‌చ్చారు. మీ శారీర‌క స‌మ‌తుల్య‌త‌ను కొన‌సాగించే సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి దీనిని లెక్కిస్తారు. అంటే ఏదైనా రోగం బారిన ప‌డిన‌ప్పుడు మీరు ఎంత త్వ‌ర‌గా కోలుకుంటున్నార‌న్న‌ది ఇక్క‌డ ప్ర‌ధానం. ఇది సాధార‌ణంగా వ‌య‌సును బ‌ట్టి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది.

ఈ అధ్య‌య‌నంలో భాగంగా ప‌రిశోధ‌కులు 85 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కూ ఉన్న 70 వేల మంది ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించారు. వారి ర‌క్త క‌ణాల సంఖ్య‌లో వ‌చ్చిన స్వ‌ల్ప కాలిక మార్పుల‌ను ప‌రిశీలించారు. మ‌నిషిలోని తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య శ‌రీరంలోని ఇన్‌ఫ్లేమేష‌న్ స్థాయిని సూచిస్తుంది. ఇక ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య ద్వారా ఓ మ‌నిషికి వ‌చ్చే గుండె జ‌బ్బులు, జ్ఞాప‌క‌శ‌క్తి కోల్పోవ‌డం వంటి వాటిని అంచ‌నా వేయ‌వ‌చ్చు. ప‌రిశోధ‌కులు ఈ స‌మాచారాన్ని స‌రళీకృతం చేసి ఒకే పారామీట‌ర్‌ను త‌యారు చేశారు. దానిని డైన‌మిక్ ఆర్గానిజ‌మ్స్ స్టేట్ ఇండికేట‌ర్ (డీఓఎస్ఐ) అని పిలిచారు.

ఈ డీఓఎస్ఐ విలువల్లో మార్పుల‌ను బ‌ట్టి ఈ అధ్య‌యనంలో పాల్గొన్న వాళ్ల‌లో ఎవ‌రు వ‌య‌సు సంబంధిత రోగాల‌తో బాధ‌ప‌డ‌తారో, అది మ‌నిషికి మ‌నిషికి ఎలా మారుతుందో, వాళ్ల శారీర‌క స‌మ‌తుల్య‌త‌ను ఎలా కోల్పోతున్నారో అంచ‌నా వేశారు. ఈ అంచ‌నాలు ఓ మ‌నిషి ఆరోగ్యం, జీన్స్‌తో సంబంధం లేకుండా వాళ్ల‌లోని శారీర‌క స‌మ‌తుల్య‌త 150 ఏళ్ల ద‌గ్గ‌ర పూర్తిగా విఫ‌ల‌మ‌వుతోంద‌ని తేల్చాయి. దీనిని బ‌ట్టే ఓ మ‌నిషి గ‌రిష్ఠంగా జీవించే కాలం 150 ఏళ్లు ఉంటుంద‌ని అధ్య‌య‌నం చేసిన ప‌రిశోధ‌కులు ఓ అంచ‌నాకు వ‌చ్చారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌నిషి 150 ఏళ్లు బ‌తుకుతాడా.. తాజా అధ్య‌య‌నం ఏం చెబుతోంది?

ట్రెండింగ్‌

Advertisement