Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాన్షు బృందం ఇవాళ క్షేమంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. వీరు ప్రయాణిస్తున్న స్పేస్‌క్రాఫ్ట్ ఇవాళ మధ్యాహ్నం 3:01 గంటల సమయంలో అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యింది. అనంతరం అక్కడే ఉన్న సిబ్బంది వారి వద్దకు చేరుకొని నౌకలోకి తీసుకొచ్చారు.
తాజాగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు డ్రాగన్ క్యాప్సూల్ (Dragon capsule) నుంచి బయటకు వచ్చారు. దాదాపు 18 రోజుల తర్వాత గురుత్వాకర్షణను అనుభవించారు. ఇందుకు సంబంధించిన తొలి ఫొటో బయటకు వచ్చింది. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో యాక్సియమ్-4 (Ax-4) మిషన్ విజయవంతమైంది. ఇక భూమికి చేరుకున్న వ్యోమగాములు ఏడు రోజుల పాటూ క్వారంటైన్లో ఉండనున్నారు. ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారు.
శుభాన్షు రికార్డు..
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే. తిరుగు ప్రయాణం నేపథ్యంలో ఆదివారం అంతరిక్ష కేంద్రంలో ఫేర్వెల్ సెర్మనీ జరిపారు.
Also Read..
Shubhanshu Shukla | వెల్‌కమ్‌బ్యాక్.. క్షేమంగా భూమికి చేరుకున్న శుభాన్షు బృందం
Shubhanshu Shukla: అంతరిక్షంలో హెయిర్ కటింగ్ చేయించుకున్న శుభాన్షు శుక్లా
SpiceJet | కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ప్రయాణికులు.. స్పైస్‌జెట్ విమానంలో గందరగోళం